‘రుద్రమదేవి’ కోసం మెగాస్టార్ చిరంజీవి..!

chiranjeevi
గుణశేఖర్ కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చారిత్రక సినిమా ‘రుద్రమదేవి’. భారీ బడ్జెట్‌తో ఇండియాలోనే మొదటిసారిగా స్టీరియో స్కోపిక్ 3డీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. హీరో రానా, నిత్యామీనన్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో ఈ సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించాయి.

ఇక ఇప్పటికే ఎన్నో అలంకారాలతో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు తాజాగా మరో అలంకారం వచ్చి చేరింది. మెగాస్టార్ చిరంజీవి రుద్రమదేవి సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పారు. తెలుగు ప్రేక్షకులందరినీ ఓ రేంజ్‌లో ఉర్రూతలూగించిన చిరు వాయిస్‌తో రుద్రమదేవి సినిమా ప్రేక్షకులకు పరిచయం కానుండడం విశేషమే!

గతంలో చిరు-గుణ శేఖర్‌ల కలయికలో చూడాలని ఉంది, మృగరాజు లాంటి సినిమాలు రూపొందిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ ఉన్న స్నేహంతోనే రుద్రమదేవి సినిమాకు చిరు వాయిస్ ఓవర్ చెప్పారు. ఇప్పటికే ఆయన డబ్బింగ్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. జూన్ 26న తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మార్క్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‍గా నిలవనుందని తెలుస్తోంది.

Exit mobile version