ఒక నటుడిగా, హీరోగా నాపై ప్రెజర్ ఎప్పుడూ ఉంటుంది. సినిమా రిజల్ట్(హిట్, ప్లాప్)తో సంబంధం లేదు అని అన్నారు అక్కినేని యువ హీరో నాగ చైతన్య. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నాగ చైతన్య, పూజ హెడ్గే జంటగా నటించిన ‘ఒక లైలా కోసం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నాగ చైతన్య పైవిధంగా వ్యాఖ్యానించారు. నాగ చైతన్య చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో..
‘100% లవ్’ తరహాలో ‘ఒక లైలా కోసం’..
‘ఒక లైలా కోసం’ సినిమా ‘100% లవ్’ తరహాలో ఉండే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. గతంలో నేను చేసిన ప్రేమ కథలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. హీరో హీరోయిన్ల క్యారేక్టరైజేషణ్ చాలా కొత్తగా ఉంటాయి. లవ్ ఎంటర్టైనర్ అయినా కావలసినంత యాక్షన్ ‘ఒక లైలా కోసం’లో ఉంది.
రొమాంటిక్ ఫిల్మ్స్ – నా కంఫర్ట్ జోనర్..
నా కెరీర్లో ఎక్కువ శాతం విజయాలను లవ్ & రొమాంటిక్ సినిమాలు అందించాయి. రొమాంటిక్ సినిమాలు చేయడం చాలా కంఫర్ట్ గా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాను కూడా. కాని యాక్షన్ సినిమాలు చేయడం అంటే ఇష్టం. నేను చేసిన యాక్షన్ ఫిల్మ్స్ ఆశించిన రీతిలో విజయం సాదించలేదు. హిట్ ట్రాక్ ఎక్కించే సరైన యాక్షన్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ యాక్షన్ కమర్షియల్ స్క్రిప్ట్ దొరకడానికి మరికొంత సమయం పట్టొచ్చు.
హిట్, ప్లాప్ సినిమాలతో సంబంధం లేదు..
ఒక సినిమా హిట్ అయితే తర్వాత సినిమా ఇంకా బాగా చేయాలనీ ఉంటుంది. ప్రేక్షకులు మనపై అంచనాలు పెట్టుకుంటారు. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే తర్వాత సినిమాతో సక్సెస్ కొట్టాలని కసితో పని చేస్తాం. అందువల్ల ఒక నటుడిగా నాపై ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. హిట్, ప్లాప్ సినిమాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేయాలని ఉంది.
కొత్త దర్శకులకే నా ఓటు..
నా సినిమాలలో కమర్షియల్ వాల్యూస్ ఎంత వరకు ఉన్నాయనే విషయం పరిగణలోకి తీసుకొను. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కగా ఉండేలా చూసుకుంటున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు మంచి వినోదం అందించాలి. అదే నాకు ముఖ్యం. హీరోగా నా సినిమాల సంఖ్య కేవలం 10 లోపు మాత్రమె. అందుకే ఎక్కువగా కొత్త దర్శకులతో, ఒకటి రెండు సినిమాలు చేసిన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తాను. దర్శకుడి గత సినిమా హిట్ అయ్యిందా..? లేదా..? అని విషయాలు పట్టించుకోను.
విజయ్ కుమార్ కొండా కథ నచ్చింది..
‘గుండెజారి గల్లంతయ్యిందే’ విజయం చూసి విజయ్ కుమార్ కొండాకు అవకాశం ఇవ్వలేదు. అతను చెప్పిన కథ నచ్చడంతో ‘ఒక లైలా కోసం’లో నటించడానికి అంగీకరించాను. అతని వర్కింగ్ స్టైల్, సినిమా చిత్రీకరిస్తున్న విధానం పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. అనూప్ రూబెన్స్ మంచి పాటలు కంపోజ్ చేశాడు. శ్రోతల నుండి విశేషమైన స్పందన వస్తుంది. రైట్ టైం చూసుకుని సినిమాను విడుదల చేస్తాం’ అంటూ నాగ చైతన్య తన సంభాషణను ముగించారు.
‘ఒక లైలా కోసం’ ట్రైలర్ చూడడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


