విడుదల తేదీ : జూలై 17, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5
నటీనటులు : మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా తదితరులు
దర్శకత్వం : క్రిస్టోఫర్ నోలన్
నిర్మాతలు : ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్
సంగీతం : లుడ్విగ్ గొరాన్సన్
ఛాయాగ్రహణం : హోయ్తే వాన్ హోయ్తేమా
కూర్పు: జెన్నిఫర్ లేమ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
హాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుంచి సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హోమర్ రాసిన ప్రసిద్ధ గ్రీకు ఇతిహాసం ఆధారంగా నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ “ది ఒడిస్సీ”. భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ ఎపిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలో చూద్దాం.
కథ:
ట్రోజన్ యుద్ధంలో గ్రీకులు ఎట్టకేలకు విజయం సాధిస్తారు. భారీ చెక్క గుర్రం సాయంతో శత్రువుల కోటలోకి తెలివిగా ప్రవేశించి ఒడిస్సియస్ (మ్యాట్ డామన్) వేసిన మాస్టర్ ప్లాన్ వల్లే ఈ గెలుపు సాధ్యమవుతుంది. అయితే యుద్ధం ముగిశాక తన సొంత రాజ్యం ‘ఇతాకా’కు తిరుగు ప్రయాణమైన ఒడిస్సియస్ కు అసలు కష్టాలు మొదలవుతాయి. అతడి ప్రయాణాన్ని అడ్డుకునేందుకు దేవుళ్లు పన్నే పద్మవ్యూహాలు ఒకెత్తైతే.. తన సొంత రాజ్యంలో ఎదురయ్యే మరో అతిపెద్ద ముప్పు ఇంకో ఎత్తు. మరి ఇన్ని అడ్డంకులను ఒడిస్సియస్ ఎలా దాటాడు? తన కుటుంబాన్ని, రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేది సిల్వర్ స్క్రీన్ పై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ప్రపంచానికి ఎప్పుడో తెలిసిన ఒక పురాతన ఇతిహాసాన్ని సినిమాగా తీయడం మామూలు విషయం కాదు. కానీ తనదైన మార్క్ టేకింగ్ తో ఈ కథకు ప్రాణం పోశారు నోలన్. స్క్రీన్ ప్లే మ్యాజిక్ లా సాగుతుంది. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాయి.
ఒడిస్సియస్ మరియు అతని అనుచరులు స్వదేశానికి తిరిగి వచ్చే ప్రయాణంలో ఎదుర్కొనే కష్టాలను చూపించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ఒక గుహలో జరిగే ఎపిసోడ్ థ్రిల్లింగ్ హారర్ సీక్వెన్స్‌లా సాగి మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. మంత్రగత్తెతో కూడిన సీక్వెన్స్, ట్రాయ్ నగరాన్ని నాశనం చేసే చెక్క గుర్రం ఎపిసోడ్, అలాగే ఒడిస్సియస్ అనుచరులతో పోరాడే భారీకాయులైన లేస్ట్రిగోనియన్స్‌తో కూడిన బ్లాక్‌లు స్వచ్ఛమైన సినీ విందుగా నిలుస్తాయి. ఇక సెంటిమెంట్ పరంగా చూసుకుంటే.. అపరాధ భావంతో హీరో కుమిలిపోయే తీరు, పెనెలోప్ (అన్నే హాత్వే) పోరాటం, మాస్టర్ పట్ల యూమేయస్ చూపించే లాయల్టీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి.
హీరో మ్యాట్ డామన్ తన నటనతో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ లో రెచ్చిపోవడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్ లో కంటతడి పెట్టిస్తాడు. అన్నే హాత్వే తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. టామ్ హాలండ్, అన్నే హాత్వే మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. ఇక విలన్ గా రాబర్ట్ ప్యాటిన్సన్ భయంకరమైన నటన కనబరచగా, దేవత ఎథీనా పాత్రలో జెండయా మెప్పించింది. మిగిలిన హాలీవుడ్ తారాగణం అంతా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
నోలన్ తన సినిమాల్లో లాజిక్స్ కు, ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ సినిమాలో కూడా అదే ఫాలో అయ్యారు. కాకపోతే కథ డిమాండ్ మేరకు అక్కడక్కడా పేసింగ్ కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇక గ్రీకు పురాణాల గురించి పెద్దగా ఐడియా లేని వారికి మొదటి అరగంట పాత్రలు, వారి నేపథ్యం అర్థం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. పాత్రల గురించి ముందే కొంత అవగాహనతో వెళితే సినిమాను మరింత ఎంజాయ్ చేయవచ్చు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్ గా ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. లుడ్విగ్ గొరాన్సన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను ఎలివేట్ చేసింది. హోయ్తే వాన్ హోయ్తేమా సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. రియల్ లొకేషన్స్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. నోలన్ విజన్ కు తగ్గట్టుగా ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది.
తీర్పు:
ఓవరాల్ గా.. క్రిస్టోఫర్ నోలన్ మరోసారి తన డైరెక్షన్ తో మ్యాజిక్ చేసిన అద్భుత దృశ్య కావ్యం ‘ది ఒడిస్సీ’. అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, విజువల్స్ తో ఈ సినిమా ప్రేక్షకులకు ఒక ఫీస్ట్ లా సాగుతుంది. అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు అనిపించినా.. థియేటర్లలో ఆడియన్స్ విజిల్స్ వేసే రేంజ్ లో సాగే మన ఇండియన్ కమర్షియల్ క్లైమాక్స్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. ప్రతి ఒక్కరూ థియేటర్ లో, ముఖ్యంగా బిగ్ స్క్రీన్ పై తప్పక చూడాల్సిన ఎపిక్ బ్లాక్ బస్టర్ ఇది.
123telugu.com Rating: 3.75/5
Reviewed by 123telugu Team
