హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమా వస్తోందంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ది డార్క్ నైట్’, ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్స్టెల్లార్’, ‘ఒపెన్‌హైమర్’ వంటి మాస్టర్ పీసెస్ తర్వాత నోలన్ దర్శకత్వంలో వస్తున్న 13వ సినిమా ‘ది ఒడిస్సీ’. హోమర్ రాసిన ప్రసిద్ధ గ్రీకు పురాణ ఇతిహాసం ఆధారంగా ఒక పౌరాణిక యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని నోలన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.
ఈ సినిమాకు ఉన్న అత్యంత పెద్ద విశేషం ఏంటంటే.. ప్రపంచ సినిమా చరిత్రలోనే పూర్తిగా సరికొత్త IMAX® ఫిల్మ్ టెక్నాలజీ కెమెరాలతో చిత్రీకరించిన మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ ఇదే. దాదాపు ఆరు దేశాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేందుకు నోలన్ టీమ్ సర్వం సిద్ధం చేసింది.
యుద్ధం గెలిచిన రాజు.. తండ్రి కోసం కొడుకు అన్వేషణ
కథ విషయానికి వస్తే.. ఇథాకా ద్వీపానికి రాజు అయిన ఒడిస్సియస్ (మాట్ డామన్), తన అద్భుతమైన ‘ట్రోజన్ హార్స్’ వ్యూహంతో అగమెమ్నన్ కోసం యుద్ధాన్ని గెలుస్తాడు. అయితే యుద్ధం ముగిసిన తర్వాత దేవతలు, రాక్షసులు, భీకరమైన తుఫానులను ఎదుర్కొంటూ తన స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో ఒడిస్సియస్ చిక్కుకుపోతాడు. మరోవైపు ఇథాకా రాజ్యంలో పరిస్థితులు చేయిదాటిపోతాయి. కొందరు తోడేళ్లలాంటి రాకుమారులు, ప్రభువులు రాజభవనాన్ని ఆక్రమించి, ఒడిస్సియస్ చనిపోయాడని నమ్మబలుకుతూ.. క్వీన్ పెనెలోప్ (ఆన్ హాత్వే)ను పెళ్లి చేసుకుని సింహాసనాన్ని దక్కించుకోవాలని ఒత్తిడి తెస్తుంటారు. ఈ సంక్షోభ సమయంలో, తన తండ్రి ఇంకా బతికే ఉన్నాడనే నమ్మకంతో యువ రాకుమారుడు టెలిమాకస్ (టామ్ హాలండ్) తన తండ్రిని వెతికేందుకు బయలుదేరడమే ఈ సినిమా కథాంశం.
గ్లోబల్ స్టార్ల లైనప్.. టెక్నికల్ వండర్
ఈ పీరియాడిక్ డ్రామా కోసం నోలన్ హాలీవుడ్‌లోని టాప్ స్టార్స్‌ను రంగంలోకి దించారు. ఒడిస్సియస్‌గా ఆస్కార్ విజేత మాట్ డామన్, ఆయన కొడుకు టెలిమాకస్‌గా బాఫ్టా అవార్డు విన్నర్ టామ్ హాలండ్ కనిపిస్తారు. అలాగే పెనెలోప్‌గా ఆన్ హాత్వే, విలన్ పాత్ర అయిన ఆంటినోస్గా రాబర్ట్ పాటిన్సన్ అలరించనున్నారు. వీటితో పాటు లుపిటా న్యోంగో, సమంతా మోర్టన్, జాన్ లెగుయిజామో కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. దేవత ఎథీనాగా జెండయా, అప్సరస కాలిప్సోగా చార్లిజ్ థెరాన్ నటిస్తున్నారు.
సాంకేతిక విభాగంలోనూ నోలన్ తన పాత నమ్మకస్థులనే నమ్ముకున్నారు. ఈ విజువల్స్ ప్యాకేజీకి హోయిట్ వాన్ హోయిటెమా ఛాయాగ్రహణం అందించగా, లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం సమకూర్చారు. జెన్నిఫర్ లేమ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. యూనివర్సల్ పిక్చర్స్ నిర్మించిన ఈ భారీ చిత్రాన్ని 2026, జులై 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. భారత్‌లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
