ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువగా టచ్ చేసిన జానర్ లలో టైం ట్రావెల్ లేదా టైం తో సంబంధించిన జానర్ సినిమాలు కూడా ఒకటి. అయితే ఎప్పుడో 1990 ల లోనే బాలయ్య, విలక్షణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు లాంటి దిగ్గజాలు, అప్పటి పరిస్థితులుకి అడ్వాన్స్డ్ గా ఆలోచించి టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వర్తమానం, భవిష్యత్, భూత కాలమానంలో ఆదిత్య 369 అనే సినిమా తీసి చూపించి సూపర్ హిట్ కొట్టారు.
అయితే ఇప్పుడు ఇదే తరహాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి కూడా ఉంటుంది అని తెలుస్తోంది. మేకర్స్ ఆల్రెడీ ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని కన్ఫర్మ్ చేశారు. అయితే చాలామంది కేవలం గతం, ప్రస్తుతం సీన్స్ మాత్రమే చూపిస్తారని అనుకోని ఉండొచ్చు కానీ వీటితో పాటుగా భవిష్యత్ కాలమానంకి కూడా తీసుకెళ్తారని తెలుస్తోంది.
2070 ఆపై సమయంలో కూడా సీన్స్ ఉంటాయని టాక్. సో ఇలా ఆదిత్య 369 స్టైల్ లో మరోసారి మూడు కాలమానాలను మనం చూడబోతున్నాం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. అలాగే ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు. ఏప్రిల్ 7, 2027న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతోంది.
