హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఇండియాలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తీసిన లాస్ట్ మూవీ ‘ఓపెన్‌హైమర్’ మన దేశంలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందిన మరో మాస్టర్ పీస్ ‘ది ఒడిస్సీ’ జులై 17న థియేటర్లలోకి రాబోతోంది. మ్యాట్ డామన్, టామ్ హాలండ్ లాంటి హాలీవుడ్ స్టార్స్ యాక్ట్ చేసిన ఈ ఎపిక్ మూవీ కోసం మన ఆడియన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న హైప్ కారణంగా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. ఈ రేట్లు చూస్తే సాధారణ ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారెంటీ.
రికార్డ్ స్థాయిలో టికెట్ రేట్లు
ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ (IMAX) 70ఎంఎం ఫిల్మ్ కెమెరాలతో షూట్ చేశారు. అందుకే దీనికి ఐమాక్స్ థియేటర్లలోనే అసలైన సిసలైన కిక్ వస్తుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ముంబైలోని పీవీఆర్ ఐకాన్ (లోయర్ పరేల్) మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ రిక్లైనర్ సీట్ రేటు ఏకంగా రూ. 3,100 గా ఫిక్స్ చేశారు. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని పీవీఆర్ ప్రియా, సెలెక్ట్ సిటీ వాక్ లాంటి మల్టీప్లెక్సుల్లో రిక్లైనర్ టికెట్ ధరలు రూ. 2,500 వరకు పలుకుతున్నాయి. ఇవే థియేటర్లలో నార్మల్ సీట్స్ కూడా రూ. 1,000 నుంచి రూ. 2,100 మధ్యలో ఉన్నాయి. అయినా కూడా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్.. ఆ రేట్లకు టికెట్లు కొనేందుకు కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.
ఆ సిటీల్లో కాస్త ఊరట
ముంబై, ఢిల్లీతో పోల్చుకుంటే మిగతా నగరాల్లో రేట్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. బెంగళూరులోని మల్టీప్లెక్సుల్లో ఈ సినిమా టికెట్లు రూ. 1,200 నుంచి రూ. 1,950 మధ్య ఉండగా.. కోల్‌కతాలో రూ. 1,100 నుంచి రూ. 1,240 వరకు అమ్ముతున్నారు. ఇక టికెట్ రేట్లపై గవర్నమెంట్ కంట్రోల్ ఉండే చెన్నైలో మాత్రం ఐమాక్స్‌లో కూడా గరిష్టంగా రూ. 508కే ‘ది ఒడిస్సీ’ టికెట్లు దొరుకుతున్నాయి. ఏదేమైనా క్రిస్టోఫర్ నోలన్ సినిమా అనగానే హాలీవుడ్ రేంజ్‌కి ఏమాత్రం తగ్గకుండా ఇండియాలో కూడా రికార్డ్ స్థాయి వసూళ్లు రావడం పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రీక్ మైథాలజీ కథతో వస్తున్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
