జీ5 లో మిస్టరీ కామెడీ సిరీస్.. ‘మేము కాప్’లం అంటూ నవ్వించడానికి సిద్ధం..!

టాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కామెడీ మరియు మిస్టరీ కలయికతో రూపొందుతున్న ఈ సిరీస్ పేరు ‘‘మేము ‘కాప్‌’లం’’. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో స్థానిక రాజకీయాలు, నిత్యం మనం చూసే పాత్రల మధ్య జరిగే ఒక ఊహించని గందరగోళాన్ని ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఇప్పటికే గెటప్ శ్రీను, జాఫర్ నటించిన స్పెషల్ టైటిల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలను పెంచింది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సిరీస్‌కు ‘వికటకవి’ దర్శకుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు.

​ఈ సిరీస్ ప్రధానంగా గోదావరి జిల్లాల్లోని ఒక గ్రామంలో, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జరుగుతుంది. ఊరిలో సంభవించిన ఒక వింత ఘటన వల్ల గందరగోళం ఏర్పడగా, ఆ కేసును ఛేదించడానికి ఇద్దరు పోలీసుల ద్వయం రంగంలోకి దిగుతారు. వారికి ఇదే మొదటి పెద్ద కేసు కావడంతో, ఒకవైపు ఆత్మవిశ్వాసంతోనే ఉంటూనే మరోవైపు కాస్త టెన్షన్‌తో వారు చేసే విచారణ ఎంతో వినోదాత్మకంగా సాగుతుంది. చిన్న క్లూ దొరికినా ప్రతి ఒక్కరిపై అనుమానం రావడంతో కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. లోకల్ ఫ్లేవర్‌తో పాటు వ్యంగ్యమైన పాత్రల చుట్టూ తిరిగే ఈ కథనం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది.

​ఈ సిరీస్‌లో మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల ప్రధాన పాత్రలో నటిస్తుండగా, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. తన గత సిరీస్ ‘పరువు’ తర్వాత జీ5లో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి నాగబాబు స్పందిస్తూ, కథా నేపథ్యం మరియు పాత్రలు తనకు బాగా నచ్చాయని, హాస్యాన్ని స్థానిక కథలతో సమతుల్యం చేసే ఈ సిరీస్‌లో భాగం కావడం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. లక్షలాది మంది ఎంటర్టైన్మెంట్ ప్రియుల ఆదరణ పొందుతున్న జీ5, తన ఒరిజినల్స్ జాబితాలో మరో వైవిధ్యమైన కథగా ఈ ‘‘మేము కాప్’లం’’ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనుంది.

Exit mobile version