సగటు తెలుగు సినీ అభిమాని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’.. రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే! గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో బాహుబలి సినిమాను మొదటి రోజే చూసేయాలన్న ఆతృతలో ప్రతీ సినీ అభిమానీ ఉన్నారు.
దీంతో వారం క్రితం నుంచే ఈ సినిమా టిక్కెట్లకు ఆన్లైన్లో విపరీతమైన క్రేజ్ ఉండగా, నిన్న ప్రధాన థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో అడ్వాన్స్, ఆన్లైన్ బుకింగ్‌లను మొదలుపెట్టేశారు. నైజాం ఏరియాలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన మొదటి మూడు రోజులు అన్ని టిక్కెట్లు అమ్ముడైపోవడం విశేషంగా కనిపిస్తోంది. తెలుగు,తమిళ, మళయాల, హిందీ భాషల్లో సుమారు 4000 థియేటర్లలో బాహుబలి విడుదల కానుంది.


