ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా ‘రౌడీ బాయ్స్’ ఫేమ్ యువ నటుడు ఆశిష్‌తో ఒక సరికొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. నూతన దర్శకుడు ఆదిత్య రావు గంగాసాని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ సంస్కృతిని, ఇక్కడి మట్టి వాసనను ప్రతిబింబించేలా ఉండబోతోంది. ఇప్పటికే ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘ఫస్ట్ గ్లింప్స్’ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ నెల మార్చి 24న గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్‌ను వదిలారు. నలుపు మరియు ఎరుపు రంగుల కలయికతో చాలా ఇంటెన్సివ్‌గా ఉన్న ఈ పోస్టర్లో, హీరో నిప్పులతో ఫీట్లు చేస్తూ కనిపిస్తున్నారు. ముఖం కనిపించకుండా వెనుక నుండి చూపిస్తున్న ఈ స్టిల్ సినిమాలోని మాస్ యాక్షన్‌ను సూచిస్తోంది.
ఈ చిత్రానికి ‘దే తడి’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఆశిష్ పక్కా హైదరాబాదీ స్లాంగ్‌లో మాట్లాడుతూ, పూర్తి మాస్ మేకోవర్‌లో కనిపించనున్నారు. భారతీయ సినిమాలో అరుదుగా కనిపించే కొన్ని సామాజిక అంశాలను, హై-ఎనర్జీ ఎమోషన్స్‌తో ఈ కథలో చూపించబోతున్నారు. జునైద్ కుమార్ సంగీతం అందిస్తుండగా, ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తూ క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.


