‘శుభం’ ఫేమ్ హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘దీవాన’. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రం గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్‌ను పంచుకున్నారు.
– నంది అవార్డు పొందిన ‘మిణుగురులు’ చిత్రానికి అసిస్టెంట్‌గా పనిచేశా. ఆ తర్వాత పదేళ్ల పాటు కార్పొరేట్ ఉద్యోగం చేసినప్పటికీ మైండ్ నిండా సినిమా కలలనే మోశాను. థియేటర్లలో కొన్ని సినిమాల చెత్త రైటింగ్ చూసినప్పుడు నా కథలను తెరపై చూపించాలనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయేది. అందుకే ఆఫీసులో ప్రమోషన్లు కూడా వద్దనుకున్నా. సినిమా ప్రయత్నాల్లో భార్యను కష్టపెట్టా.. కొవిడ్ సమయంలో తండ్రి అనారోగ్యం వల్ల ఉద్యోగం పూర్తిగా వదిలేయాల్సి వచ్చింది. నాకు సాఫ్ట్వేర్ రాదు, కేవలం కలలు కనడమే వచ్చు.
– నేను ఎంబీఏ పూర్తి చేశాక.. అసలు ఉద్యోగం జోలికే వెళ్లకుండా ఎలాగైనా సినిమాలో ఛాన్స్ కొట్టాలని ఆగిపోయాను. అలా ఖాళీగా ఉన్న టైమ్‌లో, ఒకరోజు ఉదయం లేవగానే టీవీ ఆన్ చేస్తే జెమిని టీవీలో రోజూ వచ్చే ఒక యాంకర్ కనిపించింది. ఆమెను చూస్తుండగా నా మైండ్‌లో హఠాత్తుగా ఒక ఆలోచన ఫ్లాష్ అయింది – అసలు ఒక గుర్తుతెలియని సామాన్య వ్యక్తి వెళ్లి, రోజూ టీవీలో కనిపించే ఆ పాపులర్ యాంకర్‌ను కలిస్తే ఎలా ఉంటుంది? కలిశాక ఏమవ్వొచ్చు? అనే క్రేజీ పాయింట్ తట్టింది. ఈ సిట్యువేషన్లో ఒక అద్భుతమైన ఎమోషనల్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయనిపించింది. ఆ ఆలోచన నుండే ఈ ‘దీవాన’ కథను రాసుకున్నాను.
– అవకాశాల కోసం స్నేహితులతో కలిసి తిరుగుతున్న రోజుల్లో.. ఒకసారి రామానాయుడు స్టూడియోలో అల్లు అరవింద్ గారిని కలిసి కథ చెప్తానని అడిగాను. “గీతా ఆర్ట్స్‌కు రా, కథ బాగుంటే సినిమా తీద్దాం, లేదంటే ఓ కాఫీ వేస్ట్ అవుతుంది” అన్నారు. ఆ తర్వాత ఆఫీస్‌కు వెళ్తే నన్ను కనీసం లోపలికి కూడా రానివ్వలేదు. అలా ఆయన ముందు కూర్చొని కాఫీ తాగడానికి నాకు ఏకంగా 20 ఏళ్లు పట్టింది! ఫైనల్‌గా ఆయనకు అప్పటి నా కాలేజీ కథ కాకుండా, ఈ ‘దీవాన’ కథను చెప్పాను. ఆయనకు ఈ కథ బాగా నచ్చింది.. మొత్తానికి ఆ రోజు ఆయన అన్నట్లు ఆ కాఫీ అయితే వేస్ట్ కాలేదు.
– సినిమాలో ఆరు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి. ఎంత బడ్జెట్ ఇచ్చినా చేస్తానని చెప్పి కేవలం 5 వేల రూపాయలతో డెమో తీసి ప్రూవ్ చేసుకున్నాను. అయితే నేను 69 రోజుల్లో తీయాలనుకున్న కథను, ప్రొడ్యూసర్స్ 30 రోజుల్లో పూర్తి చేయమన్నారు. ఫ్రెండ్స్ ధైర్యంతో రంగంలోకి దిగి 42 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాను. సమయం సరిపోక ఐదారు రోజుల కంటెంట్‌ను వదులుకోవాల్సి రావడం పెద్ద ఛాలెంజ్‌గా అనిపించినా.. నా రైటింగ్ పవర్, నటీనటుల ప్రతిభ వల్ల సినిమా చాలా బాగా వచ్చింది.
– మొదట్లో ఒక నిర్మాత ఈ సినిమాను కోటి రూపాయల బడ్జెట్లో తీద్దామని చెప్పారు. ఆయనకు హీరో హర్షిత్ రెడ్డి ముందే పరిచయం. అయితే అప్పటికి నాకు హర్షిత్‌తో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. దాంతో ‘మెయిల్’ సినిమా దర్శకుడు ఉదయ్ నా ఫ్రెండ్ కావడంతో, తన ద్వారా హర్షిత్‌కి చెప్పించాను. ఫైనల్‌గా హర్షిత్ వచ్చి కథ విన్నాడు. ఇది కొంచెం 90ల నాటి లవ్ స్టోరీలా అనిపిస్తుంది, కానీ నేనెలా ఉంటానో నా రియల్ లైఫ్ శైలిలోనే ఈ సినిమాను తీశాను. ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ, కనెక్ట్ అయ్యేలా తీసిన సినిమా ఇది. ‘దీవాన’లో లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎమోషన్స్ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాయి.
– ఇండస్ట్రీలో దర్శకుల కంటే రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లే ఎక్కువ జీనియస్‌లు. మా మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ మొదట డెమోకు చెత్త మ్యూజిక్ ఇస్తే తిట్టాను, కానీ వెంటనే తను మైండ్ బ్లోయింగ్ అవుట్‌పుట్ ఇచ్చాడు. మనకున్న తక్కువ బడ్జెట్‌కు తను తప్ప ఎవరూ రారు, పైగా ఆ మ్యూజిక్ అరవింద్ సర్ టీమ్‌కు కూడా బాగా నచ్చింది. ఆ తర్వాత చాలా రోజుల సిట్టింగ్స్ తర్వాతే సినిమా పాటలను ఫైనల్ చేశాం.


