పైరసీ భూతంకి చెక్ పెట్టినట్లేనా…!

Published on Aug 13, 2019 12:54 pm IST

ప్రపంచ వ్యాప్తంగా పైరసీ భూతం ఎంతగా వ్యాపించిందో అందరికి తెలిసిన విషయమే. ప్రపంచ వ్యాప్తంగా సినీ నిర్మాతలు ఏటా వేల కోట్ల రూపాయలు పైరసి కారణంగా నష్టపోతున్నారంటే అతిశయోక్తికాదు. డ్రగ్ మాఫియా,గోల్డ్ మాఫియాలా పైరసీని ఓ పెద్ద మాఫియానే నడిపిస్తుంది. నిర్మాతలు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా వారి నుండి తమ సినిమాలను కాపాడుకోలేక పోతున్నారు. ఎప్పటికప్పుడు ఆధునిక పద్దతులను ఉపయోగించుకుంటూ ఈ పైరసీ ముఠా చెలరేగిపోతుంది. మూవీ విడుదలైన గంటల వ్యవధిలోనే నెట్ లో ప్రత్యక్షం అవుతుంది. అసలు కొన్ని సంధర్బాలలో ఏకంగా విడుదలకు ముందే చిత్రాలు లీక్ అవుతున్నాయి.

ఢిల్లీ హైకోర్టు తమిళ్ రాకర్స్ ను బ్లాక్ చేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశాలు జారీచేయడం జరిగింది. తమిళ్ రాకర్స్ తో పాటు ఈజెడ్ టీవీ, కట్ మూవీస్, లైమ్ టొరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా నిలుపుదల చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా సైట్ల యూఆర్ఎల్స్, ఐపీ అడ్రెస్ లను బ్లాక్ చేయాలని పేర్కొంది. అంతేకాకుండా, పలు నిర్మాణ సంస్థల కాపీరైట్లను ఉల్లంఘించాయంటూ వాటి డొమైన్ రిజిస్ట్రేషన్లను కూడా తొలగించాలంటూ కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసింది.

మరి ఇలాంటి కఠిన చర్యల తరువాతైనా మూవీ నిర్మాతలకు పైరసీ మాఫియా నుండి ఉపశమనం దొరుకుతుందేమో చూడాలి. చట్టపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, సినీ అభిమానులు, ప్రేక్షకులు స్వచ్చంధంగా పైరసీ చిత్రాలు చూడటం మానేస్తేనే ఈ సమస్యకు అసలైన పరిష్కారం దొరుకుతుంది.

సంబంధిత సమాచారం :