తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘దండోరా’ మరికొద్ది గంటల్లో రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాలో గ్రామాల్లో నెలకొన్న కుల సమీకరణలు, సామాజిక పరిస్థితులను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే, ఈ సినిమా సెన్సార్ ప్రక్రియలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిత్రంలో వాస్తవికత కోసం వాడిన కొన్ని పదాలు మరియు కులపరమైన ప్రస్తావనలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మొత్తం 16 కట్స్‌ను సూచించింది. ఆడియోలో ఉన్న బూతులు, కుల సంబంధిత డైలాగులను మ్యూట్ చేయడంతో పాటు, సబ్‌టైటిల్స్‌లో సైతం తగిన మార్పులు చేసిన తర్వాతే బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది.
లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ చిత్రం 2 గంటల 16 నిమిషాల నిడివితో విడుదల కానుంది. మార్క్ కె రాబిన్ అందించిన సంగీతం ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.


