ఈ రీసెంట్ కొన్ని నెలల్లోనే లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ నుంచి తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వస్తున్న చిత్రమే ‘హే బల్‌వంత్’ ( హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు). ఒక ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో సుహాస్ మంగళవారం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి తాను ఎలాంటి విశేషాలు పంచుకున్నారో ఇప్పుడు చూద్దాం.
‘హే భగవాన్’ నుండి హే బల్‌వంత్ టైటిల్ మార్చడానికి కారణమేమిటి?
భగవాన్ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో హే బల్‌వంత్ గా మార్చాం. సినిమాలో నరేష్ క్యారెక్టర్ పేరు మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలని ఆలోచించే కుర్రాడు, నాన్న బిజినెస్‌ను టేకప్ చేయాలని అనుకుంటాడు. అప్పుడు అతనికి ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంర్‌టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది.
ఈ సినిమా చాలా తక్కువ వర్కింగ్ డేస్‌లో ఈ సినిమాను పూర్తి చేశారట?
అవునండి.. నా కెరీర్‌లో సినిమా ఓకే కాగానే పూర్తిచేసి చాలా త్వరితగతిన విడుదల చేస్తున్న సినిమా ‘హే బల్‌వంత్’ సినిమా కూడా ఎంతో క్వాలిటీగా ఉంటుంది. నా కెరీర్‌లో మళ్లీ ఇంత ఫాస్ట్‌గా సినిమా జరుగుతుందా అనిపించింది.
సినిమా ఓకే చేయడానికి కారణం?
కథ వినగానే నచ్చింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్ అయ్యాను. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా ఉంది.
హే బల్‌వంత్ పట్ల ఎలాంటి అంచనాలు ఉన్నాయి?
ఈ సినిమాపై అందరికి నమ్మకం ఉంది. వంశీ నందిపాటి గారు మాకు ఈ సినిమాకు ఎంతో ధైర్యం ఇస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత అందరూ కంట్రోల్‌గా ఆలోచించి చేయమని అన్నారు. ఇంట్లో మా శ్రీమతి కూడా చెప్పింది. అందుకే మంచి సినిమాలు చేయాలని కొంత బ్రేక్ ఇచ్చి హేబల్‌వంత్ చేశాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది.
తమిళ్ సినిమా మందాడిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది.
మందాడిలో మెయిన్ విలన్ తమిళ్ సినిమా. సినిమా రిజల్ట్ తరువాత తమిళంలో బిజీ అయ్యే అవకాశం ఉంది. నేను వెయిట్ చేసిన లుక్ అండ్ క్యారెక్టర్. అంబాజీ పేట సినిమా చూసి ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యారు.
ఇంతకు ముందు దాదాపుగా అన్నీ సీరియస్ పాత్రలే చేశారు. తొలిసారిగా హేబల్‌వంత్‌లో మీ పాత్రలో కామెడీ కనిపిస్తుంది?
నా కెరీర్ ప్రారంభంలో షార్ట్‌ఫిల్మ్‌స్‌లో నేను కామెడీ పాత్రలే చేశాను. ఈ సినిమాలో నా పాత్రను చూసి మా ఆవిడ కూడా ఇలాంటి సినిమాలు చేయమని కోరింది. లక్కీగా నాకు ఈ సినిమా వచ్చింది.
కెరీర్ ఎలా అనిపిస్తుంది?
నేను పూర్తి శాటిస్‌ఫాక్షన్‌గా ఉన్నాను. ఈ సినిమా హిట్ అయితే అది ఇంకా పెరుగుతుంది. అందరూ సినిమా మీద ఫుల్ కాన్పిడెంట్‌గా ఉన్నాను. పెద్ద విజయం రాబోతుంది. ఈ సినిమా మా వైఫ్ కూడా చూసి ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇలాంటి సినిమాలు కదా నువ్వు చేయాల్సింది అంది.
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?
కార్తీక్ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్ దర్శకుడు. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను.త్వరలోనే ఫైలన్ అవుతాయి.


