విడుదల తేదీ : ఏప్రిల్ 30, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : ధనుష్, మమితా బైజు, కేఎస్ రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ రాజన్ తదితరులు.
దర్శకుడు : విఘ్నేష్ రాజా
రచయితలు : ఆల్ఫ్రెడ్ ప్రకాష్, విఘ్నేష్ రాజా
సంగీతం : జివి ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ : తేని ఈశ్వర్
నిర్మాత : ఐషరి కే. గణేష్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ధనుష్, మమిత బైజు జంటగా నటించిన తాజా చిత్రం ‘కర’. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
కరస్వామి (ధనుష్) ఒక దొంగ. అయితే, ఆ నేర జీవితాన్ని వదిలేసి, తాను ప్రేమించిన మల్లి (మమిత బైజు)ని పెళ్లి చేసుకుని ప్రశాంతంగా, సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో చివరి దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికే పరిస్థితి వస్తోంది. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని, మల్లిని పెళ్లి చేసుకుని లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ, పేదరికం కారణంగా కరస్వామి చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చనిపోయిన తన తండ్రి శవాన్ని తమ పొలంలో పాతి పెట్టడానికి బ్యాంక్ ఒప్పుకోదు. లోన్ కారణంగా ఆ పొలాన్ని జప్తు చేస్తోంది. మొత్తానికి తన తండ్రి కోసం పోరాడే క్రమంలో బ్యాంక్ దోపిడీలకు పాల్పడాలని కరస్వామి ప్లాన్ చేస్తాడు. మరి బ్యాంకులో దొంగతనం చేసిన కరస్వామిని పోలీసులు పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు?, అసలు కరస్వామి దొంగతనం చేసి ఆ డబ్బును ఏం చేశాడు ?, చివరకు కరస్వామిని పోలీసులు పట్టుకున్నారా?, లేదా ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్:
1991 నాటి ఇంధన సంక్షోభం నేపథ్యంలో సాగిన ఈ సినిమా తండ్రీకొడుకుల మధ్య ఎమోషన్స్ తో సాగింది. ముఖ్యంగా 1991 బ్యాక్ డ్రాప్‌లో ఒక సామాన్యుడు తన ఉనికి కోసం చేసే పోరాటం, అతడి లోపల జరిగే సంఘర్షణను దర్శకుడు విఘ్నేష్ రాజా క్లారిటీగా చూపించాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ చాలా సెటిల్డ్ గా కనిపించాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ ధనుష్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. ధనుష్ నటించిన విధానం ఆకట్టుకుంది.
హీరోయిన్ గా మమిత బైజు మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన కేఎస్ రవికుమార్ మెప్పించాడు. కేఎస్ రవికుమార్ – ధనుష్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఇక పోలీస్ పాత్రలో నటించిన సూరజ్ వెంజరమూడు కూడా బాగా నటించాడు. విలన్ గా జయరామ్ చాలా బాగా నటించాడు. కరుణాస్, పృథ్వీ రాజన్, మరియు శ్రీజ రవి అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
దర్శకుడు విఘ్నేష్ రాజా రాసుకున్న మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అండ్ కొన్ని ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా తండ్రి పాత్రను.. ఆ పాత్రతో ముడిపడిన మిగిలిన పాత్రలను.. వీటికి అటాచ్ చేస్తూ బ్యాంకు లోన్ కారణంగా నలిగిపోతున్న సగటు రైతుల తాలూకు సీన్స్ ను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు.
మైనస్ పాయింట్స్ :
ఫాదర్ సెంటిమెంట్ ను బాగా డిజైన్ చేసుకున్న విఘ్నేష్ రాజా
కొన్ని చోట్ల అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బ్యాంక్ లో దొంగతనాల తాలూకు కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో -హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది. కాకపోతే సినిమాలో చాలా భాగం ఎమోషనల్ గా అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడిపినా.. కొన్ని సీన్స్ మాత్రం రెగ్యులర్ గా సాగాయి. అలాగే పోలీసులకు హీరోకు మధ్య నడిచే సన్నివేశాల్లో లాజిక్ కూడా మిస్ అయింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు విఘ్నేష్ రాజా కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకున్నా.. కొన్ని సీన్స్ ను ఇంకా బెటర్ గా రాసుకోవాల్సింది. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
‘కర’ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాలో.. ధనుష్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు ప్రధాన పాత్రల తాలూకు ఎమోషన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో ధనుష్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
123telugu.com Rating: 3/5
Reviewed by 123telugu Team
