
తమిళంలో హీరో ధనుష్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కాగా ఆయన హీరోగా నటించగా, తెలుగులోకి డబ్ అయిన ‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’ ఆయనకు ఇక్కడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఈ రెండు సినిమాలతో తెలుగులో ధనుష్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడంతో తాజాగా ఆయన హీరోగా నటించగా, తమిళంలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుగా చెప్పబడుతోన్న ‘తంగమాగన్’ తెలుగులోనూ విడుదల కానుంది. ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తెలుగులో ‘నవ మన్మథుడు’ అన్న పేరు పెట్టారు.
రఘువరన్ బీటెక్ సినిమాకు దర్శకత్వం వహించిన వేల్ రాజ్ ఈ సినిమాకూ దర్శకత్వం వహించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. తెలుగులో ఎన్.వెంకటేష్, ఎన్. రవికాంత్‌లు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఈనెల 18న తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా ఒకేసారి విడుదల కానుండగా, తెలుగు వర్షన్ ఆడియోను ఈనెల 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇందుకోసం టీమ్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంత, ధనుష్‌లు ఈ ఆడియో లాంచ్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అనిరుధ్ అందించిన మ్యూజిక్ తమిళంలో మంచి హిట్ అయింది.