ప్రముఖ డాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంతో వెండితెరకు పరిచయం కానున్నారు. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె ఓ ప్రత్యేక గీతంలో అలరించనున్నారు. ఈ పాటకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ వీడియోను ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. “ఇదొక భిన్నమైన పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. శ్రష్టి వర్మ డాన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం, స్టార్ సింగర్ సునీత గాత్రం ఈ చిత్రానికి అదనపు బలం” అని పేర్కొన్నారు.
ఈ సినిమాలో సీనియర్ నటులు సుమన్, సాయికుమార్‌తో పాటు వరుణ్ సందేశ్, వితికా షేరు, నటరాజ్, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


