పోటాపోటీగా దూసుకుపోతోన్న ‘ధృవ’, ‘గౌతమిపుత్ర..’!

12th, October 2016 - 12:06:00 PM

gpsk-dhruva
దసరా కానుకగా నిన్న తెలుగు సినిమా అభిమానులకు పండగ వాతావరణాన్ని రెట్టింపు చేసేలా రెండు టీజర్స్ విడుదలయ్యాయి. అందులో ఒకటి మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ టీజర్ కాగా, రెండోది నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టీజర్. ఇక ఈ రెండు టీజర్స్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్నాయి. రెండు టీజర్లూ ఇప్పటికే 1 మిలియన్ మార్క్ దాటేసి ఆయా సినిమాలకు అభిమానుల్లో క్రేజ్ ఎంతటిదో పరిచయం చేశాయి.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి నెలలో విడుదల కానుంది. ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాగా తెరకెక్కిన గౌతమిపుత్ర ఏ స్థాయి ఇంటెన్సిటీతో ఉంటుందో టీజర్ స్పష్టం చేసింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ’ విషయానికి వస్తే, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ స్టైలిష్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తూ టీజర్‌తో కట్టిపడేశారు. డిసెంబర్‌లో ధృవ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ రెండు సినిమాలూ నిన్న విడుదలైన టీజర్స్‌తో ఇప్పటికే ఆ సినిమాలపై ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్ళాయి.