బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇండియన్ మార్కెట్లో ఏకంగా ‘పుష్ప 2’ కలెక్షన్లను సైతం అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఈ భారీ విజయం తర్వాత, ఇప్పుడు ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘ధురంధర్ : ది రివెంజ్’ (Dhurandhar : The Revenge) థియేట్రికల్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది.
తొలి భాగంలో రెహమాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత పాకిస్థాన్‌లోని లియారీలో తలెత్తిన ఉద్రిక్తతల చుట్టూ ఈ సీక్వెల్ కథ తిరుగుతుంది. హమ్జా అలియా మజారీగా తన అసలు గుర్తింపును దాచి ఉగ్రవాద ముఠాలో చేరిన జస్కీరత్ సింగ్ రంగీ (రణవీర్ సింగ్), ఇప్పుడు ‘షేర్-ఏ-బలోచ్’గా అవతారమెత్తాడు. అయితే, అతనికి మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) రూపంలో అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. హమ్జా అసలు ఉద్దేశ్యం ఏంటి? మేజర్ ఇక్బాల్ అతని రహస్యాన్ని కనిపెట్టాడా? అనే అంశాలు సినిమాలో కీలకం కానున్నాయి.
రణ్వీర్ సింగ్ అత్యంత క్రూరమైన, పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, అర్జున్ రాంపాల్‌తో అతని ఫేస్ టు ఫేస్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉండబోతున్నాయి. శాశ్వత్ సచ్దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ సినిమా స్థాయిని పెంచాయి. ఈ భారీ యాక్షన్ చిత్రం మార్చి 19న హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానుంది. అదే రోజు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొననుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
