
నటసింహం నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలను, తెలుగుదనానికి పెద్ద పీటవేసే కథలను చేయడానికి ఇష్టపడతారు. అదే కోవలో బాలకృష్ణ ఇప్పటి వరకూ తన కెరీర్లో చేయని ఓ డిఫరెంట్ కథతో చేస్తున్న 99వ సినిమా డిక్టేటర్’. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపీమోహన్ లు కథని అందించారు. జూలై 20 నుంచి మొదలైన ఈ సినిమా షూటింగ్ లో భాగంగా హైదరబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన ఈ చిత్ర టీం ప్రస్తుతం బల్గేరియాలో ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. బల్గేరియా తర్వాత పోలాండ్ వెళ్లి అక్కడ ఓ పాటని మరియు ఒక యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు.
ఏ మాత్రం గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ చిత్ర టీం ఈ సినిమాని 2016 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నామని ఇదివరకే తెలియజేశారు. తాజాగా ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసింది. ఈ చిత్ర టీంకి సన్నిహితులైన వారు చెప్పిన సమాచారం ప్రకారం 2016 జనవరి 14న సినిమాని రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు. అతి త్వరలోనే ఇదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటన కూడా చేయనున్నారు. బాలకృష్ణ ఈ సినిమా కోసం 12 కేజీల బరువు తగ్గి చాలా స్లిమ్ అవ్వడమే కాకుండా మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు.
బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీవాస్ – ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా ఉండేలా కథని రెడీ చేసారు.

