‘పటాస్’ సినిమా సూపర్ హిట్ తో నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ ఫుల్ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ తో కళ్యాణ రామ్ వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు నిర్మాతగా కళ్యాణ్ రామ్ హీరోగా ఓ సినిమా సినిమా రూపుదిద్దుకుంటోంది. గత ఏడాది ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఎఎస్ రవికుమార్ చౌదరి ప్రస్తుతం కళ్యాణ్ రామ్ కోసం ఓ కథని ప్రిపేర్ చేస్తున్నాడు.
పిల్లా నువ్వులేని జీవితం సినిమాకి ఒక నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించాడు, అలాగే పటాస్ సినిమాని నైజాం ఏరియాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేడాడు. అప్పుడే కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తానని చెప్పిన దిల్ రాజు ప్రస్తుతం ఎఎస్ రవికుమార్ చౌదరి – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. కళ్యాణ్ రామ్ ని ఓ కొత్త కోణంలో చూపించే విధంగా రవికుమార్ కథని సిద్దం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తారు.


