ఆ లెజెండరీ దర్శకుడికి కాలం కలిసిరావడం లేదు.

Published on Jun 27, 2019 3:07 pm IST

భారత దేశంలో ప్రముఖ దర్శకులలో ఒకరైన శంకర్ మొదటి సినిమా “జెంటిల్ మెన్”తో ఘనవిజయం సాధించి చిత్రపరిశ్రమలో తన ప్రయాణం ఘనంగా మొదలుపెట్టారు. తరువాత ఆయన తీసిన ప్రేమికుడు,భారతీయుడు,జీన్స్,ఒకేఒక్కడు,బాయ్స్,అపరిచితుడు ప్రతి ఒక్క చిత్రం ఓ ప్రభంజనం,దేనికది ప్రత్యేకం. ఆయన చిత్రాలు అప్పటివరకూ ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తంచెరిపివేయడంతో, దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచారు.

రజినీకాంత్ హీరోగా తీసిన ‘రోబో’ మూవీ వరకు ఆయన విజయ యాత్ర కొనసాగింది. ఈ మూవీ తరువాత ఆయన మొదటిసారి హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “3 ఇడియట్స్”ని విజయ్ హీరోగా “స్నేహితుడు” పేరుతో రీమేక్ చేశారు. మూవీ పర్వాలేదు అనిపించుకున్నా, శంకర్ స్థాయి మూవీ కాదని ప్రేక్షకులు పెదవి విరిచారు. తర్వాత విక్రంతో ప్రయోగాత్మకంగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన “ఐ” మూవీ శంకర్ కి మొదటి పరాజయాన్ని అందించింది. తాజగా ఆయన రజని,అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ తో ‘రోబో’ కి కొనసాగింపుగా చేసిన “2.0”కూడా రోబో మూవీ స్థాయి విజయాన్ని అందుకోలేదనే చెప్పాలి.

ఇక కమల్ తో కమాల్ చేద్దాం అని చెప్పి మొదలుపెట్టిన “భారతీయుడు 2” వివాదాలతో ముందుకు కదలడం లేదు. ఈ సమస్యలు చాలవన్నట్టు చైనాలో “2.0” విడుదలకు బ్రేక్ పడి శంకర్ కి మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. అక్కడ విడుదల హక్కులను సొంతం చేసుకున్న ఎచ్ వై మీడియా “ది లయన్ కింగ్” విడుదల కారణంగా ప్రస్తుతానికి విడుదల వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా వరుస సంఘటనలు ఈ లెజెండరీ దర్శకుడిని ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More