​బౌద్ధ భిక్షువుల పాదయాత్రలో ‘కింగ్ బుద్ధ’ చిత్ర బృందం

​బౌద్ధ భిక్షువుల పాదయాత్రలో ‘కింగ్ బుద్ధ’ చిత్ర బృందం

Published on Feb 24, 2026 6:00 AM IST

m 16

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయ్‌లాండ్‌కు చెందిన 60 మంది బౌద్ధ భిక్షువులు చేపట్టిన పాదయాత్రలో ‘కింగ్ బుద్ధ’ చిత్ర బృందం పాల్గొంది. కర్ణాటకలోని స్వర్ణభూమి నుండి తెలంగాణలోని నాగార్జున సాగర్ వరకు సుమారు 400 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తుర్కయాంజల్ వరకు జరిగిన 17 కిలోమీటర్ల పాదయాత్రలో హాలీవుడ్ దర్శకుడు సత్యారెడ్డి తన చిత్ర యూనిట్‌తో కలిసి అడుగులు వేశారు. ఈ సందర్భంగా బౌద్ధ భిక్షువులు సత్యారెడ్డికి బుద్ధుని లాకెట్‌ను బహూకరించి, సినిమా విజయం సాధించాలని ఆశీర్వదించారు.

​’కింగ్ బుద్ధ (We Want World Peace)’ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే 10 దేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను, మరో 15 బౌద్ధ దేశాల్లో చిత్రీకరించనున్నట్లు సత్యారెడ్డి తెలిపారు. హాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవుతున్నారు. బుద్ధుని జీవిత విశేషాలు, పంచశీల సిద్ధాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా భాషల్లో విడుదల చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

​గతంలో తాను రూపొందించిన ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా సమయంలో ప్రజాకవి గద్దర్ తనకు బౌద్ధంపై అవగాహన కల్పించారని సత్యారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పూర్తిస్థాయిలో బుద్ధునిపై సినిమా తీయడం ఒక సవాల్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లను థాయ్‌లాండ్, మలేషియాల్లో విడుదల చేసి.. ప్రీ-రిలీజ్ ఈవెంట్లను ఢిల్లీ, అమరావతిలలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచ శాంతి కోసం ఇలాంటి పాదయాత్రలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జరగాలని ఆయన ఆకాంక్షించారు.

తాజా వార్తలు