ఇంటర్వ్యూ : సుధీర్ వర్మ – ‘రణరంగం’కి ‘గాడ్ ఫాదర్ 2’నే ప్రేరణ !

Published on Aug 13, 2019 3:42 pm IST

హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా రాబోతున్న సినిమా ‘రణరంగం’. కాగా ఈ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా సుధీర్ వర్మ మీడియాతో మాట్లాడారు. మరి ఈ సినిమా గురించి సుధీర్ వర్మ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు సుధీర్ వర్మ మాటల్లోనే….

‘రణరంగం’ తియ్యడానికి మీకు ప్రేరణ ఏమిటో చెబుతారా ?

ప్రేరణ అంటే ‘గాడ్ ఫాదర్ 2’ మూవీ స్క్రీన్ ప్లే నుండి ప్రేరణ పొందడం తీసుకోవడం జరిగింది. జనరల్ గా ‘గ్యాంగ్ స్టర్’ మూవీ తీసే ఎవరికైనా గాడ్ ఫాదర్ మూవీనే ఓ ప్రేరణ. మేము కూడా ఆ స్క్రీన్ ప్లే నుండే స్పూర్తి పొంది రాసుకోవడం జరిగింది. మరి మేము ఎంతబాగా స్క్రీన్ ప్లే చేశామనేది, మూవీ ఫలితం తరువాత తెలుస్తోంది.

‘రణరంగం’ సినిమాకు శర్వానంద్ నే ఎంచుకోవడానికి కారణం ?

శర్వా చిత్రాలలో నాకు ప్రస్థానం బాగా ఇష్టం. శర్వాతో చిత్రం చేస్తే ఫ్యామిలీ, లవ్ కాకుండా కొంచెం సీరియస్ జోనర్ లో ఉన్న మూవీ చేయాలనుకున్నాను. అలా రణరంగంతో మీ ముందుకు వస్తున్నాం.

సితార బ్యానర్‌ లో సినిమా ఎలా అనిపించింది ?

నిజానికి ‘స్వామిరారా’ సినిమా విడుదల తర్వాతే చిన్నబాబుగారు పిలిచి సినిమా చేయమని అడ్వాన్స్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాను. సితార బ్యానర్ లో సినిమా చేయడానికి ఇప్పుడు కుదిరింది. సితార బ్యానర్ లో పని చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది.

ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే పెరిగిందట ?

నిర్మాత నాగవంశీగారికి సినిమా అవుట్ ఫుట్ ముఖ్యం. ఎక్కడా క్వాలిటీ తగ్గుకుండా సినిమా చేయమని చెప్పారు. ఆ క్రమంలో ముందు అనుకున్నదాని కంటే బడ్జెట్ పెరిగింది. నా కెరీర్‌ లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా. వాస్తవానికి ఇప్పటివరకూ నాగవంశీగారు నాకు బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పలేదు. ఆయనకి బడ్జెట్ కంటే కూడా సినిమా క్వాలిటీ మాత్రమే ముఖ్యం.

‘గ్యాంగ్ స్టర్’గా శర్వానంద్ ఎలా చేసాడు ?

సినిమాలో శర్వానంద్ అచ్చం ‘గ్యాంగ్ స్టర్’లానే కనిపిస్తాడు. అంతబాగా తను ఆ రోల్ ను ఓన్ చేసుకుని చేశాడు. ‘రణరంగం’లోని శర్వా క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయి. ఆ రెండు షేడ్స్ ను ఆయన బాగా పలికించారు.

‘గ్యాంగ్ స్టర్’కి సీక్వెల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిజమేనా ?

‘రణరంగం’కి సీక్వెల్ చేసే ఆలోచన అయితే ఉంది. ఈ మధ్యనే శర్వానంద్ ఓ ఐడియా చెప్పారు. అది నాకు చాల బాగా నచ్చింది. కాకపోతే సీక్వెల్ రావాలంటే రణరంగం సినిమా ముందు సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే స్వీక్వెల్‌ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ సినిమా రిలీజ్ తర్వాతే సీక్వెల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

మీ తదుపరి సినిమా ఏమిటి ?

సితార బ్యానర్‌ లోనే నా తదుపరి సినిమా ఉంటుంది. రణరంగం చేస్తున్నప్పుడే నాగవంశీగారు మరో సినిమా చేయమని అడిగారు. ప్రస్తుతానికి అయితే ‘రణరంగం’ సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘రణరంగం’ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.

సంబంధిత సమాచారం :