‘ఐ’ సినిమా విడుదలకు మార్గం సుగుమం కానుంది. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 14న విడుదల చేయడానికి నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ సన్నాహాలు చేశారు. అయితే, సినిమా నిర్మాణానికి ఆర్ధిక సహాయం చేసిన పిక్సర్ మీడియా వర్క్స్ సంస్థ, తమ డబ్బులు చెల్లించాలని మద్రాస్ హైకోర్ట్ కు వెళ్ళడంతో సినిమా విడుదలను మూడు వారాలు వాయిదా వెయ్యాలని కోర్ట్ ఆదేశించింది. ఈ పరిణామాలతో సినిమా విడుదల అవుతుందా..? లేదా..? అనే సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఆ సందేహాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్.
నేడు మధ్యహ్నం పిక్సర్ మీడియా వర్క్స్ అధినేత పివిపితో, ఆస్కార్ రవిచంద్రన్ భేటి కానున్నారు. కోర్ట్ వెలుపల చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్ధిక లావాదేవీలను సెటిల్ చేయనున్నారు. ముందుగా ప్రకటించిన సమయానికి సినిమా విడుదల చేస్తామని నిర్మాత సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం.
విక్రమ్, అమీ జాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ నిర్మాణంతర కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్దమయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు విదేశాలలో కూడా భారి ఎత్తున విడుదల చేయడానికి సనంహాలు చేశారు. ఈ సినిమాను ఏఅర్ రెహమాన్ సంగీతం అందించారు.


