టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న ఫేమస్ ఆర్ట్స్ డైరెక్టర్స్ లో మోస్ట్ టాలెంటెడ్ ఎఎస్ ప్రకాష్ ఒకరు. ఇటీవలే తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయిన శ్రీమంతుడు సినిమాకి ఆయనే ఆర్ట్ డైరెక్టర్. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్స్ లెజెండ్, బలుపు, బాద్షా, మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మొదలైన సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ప్రస్తుతం ఆయన అఖిల్ మరియు శివమ్ సినిమాలకు కూడా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇలాంటి సక్సెస్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ తో మేము కసేపు ప్రత్యేకంగా మాట్లాడాము. ఆ విశేషాలు మీకోసం..
ప్రశ్న) ముందుగా మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి.?
స) నేను పుట్టి పెరిగింది అంతా వైజాగ్ లోనే, ఫైన్ ఆర్ట్స్ లో నా డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. మొదటగా రామోజీ ఫిల్మ్ సిటీలో బాగా ఫేమస్ అయిన ఆర్ట్ డైరెక్టర్ నితీష్ రాయ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసాను. ఆయనతో ఉన్నన్ని రోజులు అసిస్టెంట్ గా ఆయనకి పలు స్కెచ్ లు గీసిచ్చాను. ఆ తర్వాత ఒకసారి డైరెక్టర్ సుకుమార్ నా స్కెచ్ లు చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు. అప్పుడే తను డైరెక్ట్ చేయబోయే ‘ఆర్య’ సినిమాకి ఆఫర్ ఇచ్చాడు.
ప్రశ్న) మరి ఆర్యతో మొదలైన మీ జర్నీ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ ఎలా ఉంది.?
స) చెప్పాలంటే మొదట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో నేను చేస్తున్న జాబు విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఆర్య తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. అప్పుడే ఇక రిస్క్ తీసుకోవాలని బయటకి వచ్చేసి ఓన్ గా కెరీర్ మొదలు పెట్టాను. ఇప్పటి వరకూ నా కెరీర్ చాలా బాగుంది. ప్రస్తుతం నేను 50 సినిమాలకు చేరువలో ఉన్నాను.
ప్రశ్న) ఒక సినిమాకి సెట్స్ డిజైన్ చెయ్యడానికి ముందు మీరేమేమి పరిగణలోకి తీసుకుంటారు.?
స) ముందుగా నేను సినిమా మొత్తం కథ వింటాను, అలాగే సినిమా యొక్క మెయిన్ థీమ్ ఏంటనేది తెలుసుకుంటాను. చెప్పాలంటే డైరెక్టర్ ఇచ్చే వెర్షన్ నాకు సినిమా గురించిన పూర్తి ఐడియా వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత నేను స్కెచ్ లు గీస్తాను, అవి డైరెక్టర్ కి నచ్చి ఫైనల్ గా ఓకే చేస్తే.. సెట్ నిర్మించడం మొదలుపెడతాను.
ప్రశ్న) ఇక సినిమా కోసం సెట్ నిర్మించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.?
స) డైరెక్టర్ ఒకసారి ఫైనల్ స్కెచ్ లు ఓకే చేసిన తర్వాత అసలైన వర్క్ మొదలవుతుంది. ప్రస్తుతం మార్కెట్ లో లాంచ్ అయి ఉన్న లేటెస్ట్ కలర్ థీమ్స్, ఫర్నిచర్, మిగిలిన లేటెస్ట్ డిజైన్స్ గురించి తెలుసుకుంటాను. అవన్నీ కొనుక్కున్న తర్వాత ఇక నా టీం, కార్పెంటర్స్ తో కలిసి సెట్ నిర్మించడం మొదలు పెడతాను.
ప్రశ్న) చూస్తుంటే.. ఇందులో చాలా హార్డ్ వర్క్ ఉన్నట్టుంది.?
స) అవునండి. టోటల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో మా డిపార్ట్మెంట్ చేసేదే చాలా కష్టతరమైన పని. కెమెరామన్ నుంచి ఫైట్ మాస్టర్ వరకూ కొత్త కొత్త ఐడియాలతో వస్తారు, వారి అందరి ఐడియాలను ఫుల్ ఫిల్ చేసేలా సెట్స్ వెయ్యాలి. ఒకవేళ షూటింగ్ టైంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నన్ను పిలిచి సెట్ చేయమని చెబుతారు. నేను ఎప్పుసూ సెట్లో అందులో బాటులో ఉండాలి, సినిమా షూటింగ్ సాఫీగా జరుగుతుందా లేదా అనేది చూసుకోవాలి.
ప్రశ్న) మీరు రీసెంట్ గా బాగా కష్టపడి చేసిన సెట్స్ గురించి చెప్పండి.?
స) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కోసం హైదరాబాద్ లోనే ఒక స్పెషల్ హౌస్ సెట్ వేశాము. కానీ చూసిన వారంతా షూటింగ్ కోసం ఒక పల్లెటూరికి వెళ్లాం అని ఫీల్ అయ్యారు. ఆ విషయంపై ఎంతో రీసర్చ్ చేసి దానికి సెట్ అయ్యేలా రియల్ ఫర్నిచర్ తీసుకొచ్చాను. అదే విధంగా శ్రీమంతుడు కూడా.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే రాజేంద్ర ప్రసాద్ హౌస్ ఎపిసోడ్ ని హైదరాబాద్ లోనే వేసాము. అలాగే 100% లవ్ సినిమాలో వాడిన ప్రాపర్టీస్ మరియు మిర్చిలో వేసిన హౌస్ సెట్ కి కూడా మంచి మన్ననలు వచ్చాయి.
ప్రశ్న) మీరు సెట్స్ డిజైన్ చేసిన సినిమాల్లో మీకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాల గురించి చెప్పండి.?
స) నేను ఇదివరకే చెప్పినట్టు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి మంచి పేరు వచ్చింది. అలాగే అల్లుడు శీను సినిమా కోసం వేసిన సెట్స్ అన్నీ బాగా ఖరీదైనవి. ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది.
ప్రశ్న) ఇప్పటి వరకూ మీరు పని చేసిన దర్శకులలో మీ ఫేవరైట్ దర్శకుడెవరో చెప్పండి.?
స) నాకు ప్రత్యేకంగా ఫేవరైట్ దర్శకులంటూ ఎవరూ లేరు. నేను ఇప్పటికే శ్రీను వైట్ల, సుకుమార్ మొదలైన దర్శకులతో చాలా సినిమాలు చేసాను. అందరి దర్శకులతో చేయడానికి ఇష్టపడతాను.
ప్రశ్న) ఇప్పటి వరకూ మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ గురించి చెప్పండి.?
స) శ్రీమంతుడు సినిమా చూసిన తర్వాత ప్రభాస్ సెట్స్ విషయంలో నన్ను చాలా బాగా మెచ్చుకున్నాడు. ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడి నన్ను మరొకసారి శ్రీమంతుడు షూట్ టైంలోకి తీసుకెళ్ళిపోయాడు. అతను అంత మెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా, గొప్పగా అనిపించింది.
ప్రశ్న) చూస్తుంటే మీ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో చాలా హార్డ్ వర్క్ కనిపిస్తోంది. మరిదానికి తగ్గట్టుగానే మీకు రెమ్యునరేషన్ ఉంటుందా.?
స) నిజంగా చెప్పాలి అంటే, చాలా మంది ఆర్ట్ డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు, వారు ప్రస్తుతం లైవ్ ఈవెంట్స్, వెడ్డింగ్స్, ఇతర క్రియేటివ్ విషయాల్లో సెటిల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ తక్కువ ప్రెజర్, ఎక్కువ మనీ వస్తుంది. కానీ ఇక్కడ నేను ఎప్పుడూ సెట్లోనే ఉండాలి, నా ఫ్యామిలీతో సరిగా స్పెండ్ చెయ్యడానికి టైం అస్సలు కుదరదు, వాటికన్నిటికంటే మించి చాలా సార్లు నిర్మాతలు మా రెమ్యూనరేషన్ విషయంలో చీటింగ్ చేస్తుంటారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మేము వాటన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాం.
ప్రశ్న) సుమారు 50 సినిమాలకి చేరువలో ఉన్నారు. కానీ మీరెందుకు బయట ఫేమస్ కాలేదు.?
స) దానికి ప్రధాన కారణం నా వర్క్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేయడం వలన ఎక్కువగా మీడియాలో కనపడలేదు. ఎక్కువ భాగం నా సెట్ స్కెచ్ లు గీసుకుంటూ, లొకేషన్స్ కోసం ట్రావెల్ చేస్తూ లేదా సెట్స్ నిర్మించే పనిలో బిజీగా ఉండేవాడిని.
ప్రశ్న) మీరు ప్రస్తుతం చేస్తున్న, చేయబోతున్న సినిమాల గురించి చెప్పండి.?
స) ప్రస్తుతం నేను అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ కోసం పనిచేసాను. ఈ సినిమాలో నేను డిజైన్ చేసిన కొన్ని సెట్స్ ఆడియన్స్ అందరినీ సర్రైజ్ చేసేలా ఉంటాయి. ఇది కాకుండా రామ్ ‘శివమ్’ సినిమాకి కూడా పనిచేసాను.
అంతటితో మా స్పెషల్ ఇంటర్వ్యూని ముగించి ముందు ముందు ఇంకా అద్భుతమైన సెట్స్ వేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించాలని ఎఎస్ ప్రకాష్ ఆల్ ది బెస్ట్ చెప్పాము.


