సుమారు 9 నెలల పాటు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కున్న సినీ రంగం ఇప్పుడిప్పుడే కొలుకుంటోంది. థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకునే దశకు వచ్చాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అన్ని సినిమాలు విడుదల తేదీలను కన్ఫర్మ్ చేసుకున్నాయి. అక్టోబర్ వరకు సినిమాల జాతర అనేలా విడుదలకు క్యూ కట్టాయి చిత్రాలు. దీంతో సినీ ప్రేమికులు ఆనందంలో ఉన్నారు. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు నడుమ కొత్త అంశం తలెత్తింది. ఎగ్జిబిటర్లు నిర్మాతలకు అల్టిమేటం ఇచ్చేశారు.
ఈరోజు సాయత్రం రామానాయుడు స్టూడియోలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు సమావేశం జరిగింది. ఇందులో తమ డిమాండ్లను వెలిబుచ్చారు ఎగ్జిబిటర్లు. మల్టీప్లెక్స్ థియేటర్ల తరహాలోనే సింగిల్ స్క్రీన్లకు కూడ పర్సంటేజ్ విధానం ఉండాలని అడిగిన ఎగ్జిబిటర్లు ఓటీటీ విడుదల విషయంలో కూడ గట్టి కండిషన్ పెట్టారు. పెద్ద సినిమా అయితే థియేటర్లలో విడుదలైన 6 వారాల తర్వాత చిన్న సినిమా అయితే 4 వారాల తర్వాత ఓటీటీల్లో విడుదల కావాలని, అప్పుడే మంచి థియేట్రికల్ రన్ ఉంటుందని అన్నారు.
ఈ కండిషన్లకు నిర్మాతలు ఒప్పుకుంటేనే సినిమా హాళ్లు నడుస్తాయని లేని పక్షంలో మార్చి1 నుండి మూతబడతాయని అన్నారు. మరి డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన ఈ నిబంధనలను నిర్మాతలు ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, డివివి దానయ్య, అభిషేక్ నామా, ఆసియన్ సునీల్, మైత్రీ మూవీస్ నిర్మాతలు, బివిఎస్ఎన్ ప్రసాద్ హాజరయ్యారు.
