
ఈ మధ్య కాలంలో వసూళ్లు తప్ప సినిమా రన్ ఎన్ని రోజులు, ఏయే సెంటర్లలో 50 రోజులు, 75 రోజులు, 100 రోజులు పూర్తిచేసుకుంది వంటి రికార్డులు అరుదైపోయాయి. ఇలాంటి తరుణంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన ‘రంగస్థలం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చాలా ఏళ్ల తర్వాత అసలు సిసలు 100 రోజుల సినిమా ఎలా ఉంటుందో చూపెట్టబోతున్నారు. ఇప్పటికే 95 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇంకా కొన్ని ఏరియాల్లో నడుస్తూ 100 రోజుల దిశగా వెళుతోంది.
ఈ నెల 7వ తేదీకి 100 రోజుల రన్ ముగియనుంది. దీంతో మెగా అభిమానులు హైదరాబాద్ ప్రధాన థియేటర్ సుదర్శన్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సినిమా నడుస్తున్న పలు థియేటర్లలో 100వ రోజున భారీ ఎత్తున శతదినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వసూళ్ల పరంగా నాన్ బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసి చరణ్ స్టార్ పవర్ ను చూపించింది.

