ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం డిసెంబర్ 3న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించినప్పటికీ, ఆ తేదీకి సినిమా రావడంపై సినీ వర్గాల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా పెండింగ్‌లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
ప్రభాస్ బల్క్ డేట్స్ ఇవ్వడం, సమాంతరంగా షూటింగ్ జరపడం వల్ల మేకర్స్ ధీమాగా ఉన్నప్పటికీ, డిసెంబర్ 4న దుల్కర్ సల్మాన్ ‘శ్రీశ్రీ’, విశ్వక్‌సేన్ ‘లెగసీ’, నాగచైతన్య ‘వృషకర్మ’ చిత్రాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రభాస్ లాంటి భారీ స్టార్ సినిమా పోటీలో ఉంటే ఇతర సినిమాలు ఇలా పోటీకి రావు కాబట్టి, ‘ఫౌజీ’ వాయిదా పడటం దాదాపు ఖాయమని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
ఒకవేళ ‘ఫౌజీ’ డిసెంబర్ రేస్ నుంచి తప్పుకుంటే, సంక్రాంతి షెడ్యూల్స్ ఇప్పటికే ఫిక్స్ అవ్వడం, ఆపై పరీక్షల సీజన్ మొదలవుతుండటంతో మళ్లీ వచ్చే సమ్మర్ వరకు సరైన రిలీజ్ డేట్ దొరకడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఈ రిలీజ్ అయోమయంపై ‘ఫౌజీ’ మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.


