ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా…!

Published on Aug 20, 2019 10:53 am IST

సంక్రాంతి ఏడాది మొత్తంలోనే అతిపెద్ద సినిమా సీజన్ గా పేరుంది. తెలుగు వారి పెద్ద పండుగ కావడంతో పాటు, సెలవు దినాలు అధికంగా లభించే పండుగ కావడంతో ఈ పండుగకు విడుదలైన ఓ మోస్తరు చిత్రం కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది. అందుకే బడా నిర్మాతలు, హీరోలు ఈ పండుగకు తమ చిత్రాల విడుదల వుండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఐతే 2020 సంక్రాంతి నలుగురు స్టార్ హీరోలతో సందడిగా మారనుంది.

మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో, బాలయ్య కేఎస్ రవికుమార్ దర్శకతంలో తెరకెక్కుతున్న చిత్రాలతో పాటు రజని దర్బార్ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే దిగనుందని సమాచారం. ఇవి నాలుగు పెద్ద హీరోల చిత్రాలు కావడంతో పాటు, క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రాలు.

మహేష్ మొదటి సారి ఆర్మీ మేజర్ గా చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని, గత సంక్రాంతికి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి తెరకెక్కింస్తుడటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అలాగే సీనియర్ హీరోయిన్ విజయశాంతి 13ఏళ్ల తరువాత ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర చేయడం గమనార్హం.

ఇక బన్నీ, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న అల వైకుంఠపురంలో పై కూడా అభిమానులకు భారీ అంచనాలున్నాయి. హిట్ కాంబినేషన్ పాటు ,బన్నీ నుండి దాదాపు సంవత్సర కాలం తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తునారు. ఇక సంక్రాంతి హీరోగా పేరున్న బాలయ్య వీరందరి కంటే ముందే సంక్రాంతి బెర్త్ పై కర్చీఫ్ వేయడం జరిగింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రాన్ని ఎలాగైనా సంక్రాంతి కి విడుదల చేయాలని నిరవధిక షూటింగ్ జరుపుతున్నారని సమాచారం.

ఇక సూపర్ స్టార్ రజిని చాలా కాలం తరువాత పోలీస్ గా చేస్తున్న చిత్రం దర్బార్. తమిళ టాప్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ముంబై మాఫియా నేపథ్యంలో రూపొందుతుంది. రజని, మురుగదాస్ మొదటి సారి కలిసి చేస్తున్న క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలున్నాయి. ఇది డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ రజినీ చిత్రాలకు తెలుగులో ఉన్న మార్కెట్ దృష్ట్యా ఇక్కడి స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే చిత్రం దర్బార్ అనడంలో సందేహం లేదు.

ఇక మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా తన తాజా చిత్రం ఎంత మంచివాడవురా చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేయాలనీ చూస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో నలుగురు స్టార్ హీరోల మూవీలతో 2020 సంక్రాంతి సమరం రసవత్తరంగా మారింది. ఐతే ఈ చిత్రాలు అన్ని అనుకున్న టైంకి తమ చిత్రాలను విడుదల చేయగలవా లేదా అన్నదే సందేహం.

సంబంధిత సమాచారం :