
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సినిమా ‘టెంపర్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవలే హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ చనిపోవడంతో ఎన్.టి.ఆర్ సినిమాకి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాడు. నిన్న కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్ కలిసి జానకిరామ్ అస్తికలను కృష్ణ నదిలో కలిపారు. ఈ రోజు నుంచి ఎన్.టి.ఆర్ ‘టెంపర్’ షూటింగ్ లో బిజీగా ఉండనున్నాడు. ఎన్.టి.ఆర్ పూర్తిగా ఆ బాధ నుండి కోలుకోకపోయినా టెంపర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో షూటింగ్ కి ఓకే చెప్పాడు.
ఇంకా టెంపర్ లో భాగంగా ఓ పాట, ఫైట్ మరియు కొన్ని కీలక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. షూటింగ్ మొదలైనప్పటి నుంచే తక్కువ టైంలో రిలీజ్ చెయ్యాలి అనుకోవడంతో షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే డబ్బింగ్ కార్యక్రమాలను కూడా ప్రారంభమయ్యాయి. ఎన్.టి.ఆర్ పోలీస్ ఆఫీసర్ గానే కాకుండా సరికొత్త మేకోవర్ తో స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. ఆ లుక్ కి సంబందించిన ఫోటోలు ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘బాద్షా’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.