తమిళనాట రజనీకాంత్, విజయ్, అజిత్ లాంటి పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే ఆరోజు పెద్ద యుద్దమే అనుకోవాలి. అభిమానులు విపరీతమైన ఉత్సాహంతో ఉంటారు. అందుకే పోలీసులు, ప్రభుత్వం ఆరోజు కొంచెం ఎక్కువ అలర్ట్ అవుతుంటాయి. అయినా ఒక్కోసారి పరిస్థితులు అదుపుతప్పుతుంటాయి. అలాంటి ఘటనే ఈరోజు ‘బిగిల్’ విడుదల సమయంలో జరిగింది.
విజయ్, అట్లీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆతురతగా ఉన్న ఫ్యాన్స్ స్పెషల్ షోలు వేయాలని డిమాండ్ చేశారు. మొదట ప్రభుత్వం నిరాకరించినా ఆ తర్వాత ఒప్పుకుని షోలకు అనుమతులిచ్చింది. కానీ కొన్ని కారణాల వలన క్రిష్ణగిరిలోని ఓ ప్రధాన థియేటర్లో షో వేయలేకపోయారు నిర్వాహకులు. అప్పటికే షో కోసం థియేటర్ వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు విషయం తెలుసుకుని పట్టరాని కోపంతో ఊగిపోయారు.
థియేటర్ అద్దాలను, గేట్లను ధ్వంసం చేయడమే కాక వందల సంఖ్యలో రోడ్డు మీదికి చేరుకుని కనిపించిన వాహనాలు, షాపులపై విరుచుకుపడ్డారు. వాటర్ ట్యాంకులను, బారిగేట్లను ధ్వంసం చేశారు. రోడ్డుపై నిప్పు పెట్టారు. దాంతో పోలీసులు అక్కడకు చేరుకుని లాఠీఛార్జ్ జరిపి 30 మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు కొద్దిగా భారీగా నష్టమే వాటిల్లినట్టు తెలుస్తోంది.


