
ఎప్పుడెప్పుడు తమ హీరో కొత్త సినిమా మొదలుపెడతాడా? అని ఎదురుచూసిన అభిమానులకు శుభవార్తను అందిస్తూ ఈమధ్యే పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా ‘గబ్బర్ సింగ్ 2’ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే! పూణేలోని ఓ చిన్న గ్రామంలో ‘గబ్బర్ సింగ్ 2’ ఫస్ట్ షెడ్యూల్ కూడా ఈ మధ్యే పూర్తైంది. ‘పవర్’ సినిమా ద్వారా హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు ‘గబ్బర్ సింగ్ 2’ అని కాకుండా ‘సర్దార్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తునట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై సినిమా యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేసుకుంటున్నారు.

