‘అలియాస్ జానకి’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై ఆ తర్వాత పెద్దగా కనిపించకుండా పోయిన అనీష అంబ్రోస్ ఈ మధ్య టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది. దానికి కారణం గబ్బర్ సింగ్ 2 సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడమే. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది పక్కన పెడితే ఈ భామ పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల సినిమాలో ఓ చిన్న రోల్ చేసింది. అదే వెంకటేష్ ని ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్ పాత్ర. ముందుగా తన సన్నిహితులు ఈ రోల్ చేయడానికి అంగీకరించవద్దని చెప్పారట.
కానీ అనీష మాత్రం వాళ్ళని కాదని తన మనసుకు నచ్చింది చేసిందట. ‘చాలా మంది అది చాలా చిన్న పాత్ర చెయ్యకు, హీరోయిన్ గా కాకుండా చిన్న రోల్స్ చేస్తే ప్రేక్షకులు గుర్తుపెట్టుకోరు. కానీ వారి సలహాల కంటే నా మనసుకి ఏమి అనిపించిందో అదే చేసాను. ఈ సినిమా ఓకే చెయ్యడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది హిందీ ఓ మై గాడ్ చూసేప్పుడు బాగా ఎంజాయ్ చేసాను, ఇక రెండవది పవన్ కళ్యాణ్ – వెంకటేష్ లాంటి హీరోలు నటిస్తున్న సినిమాలో ఛాన్స్ రావడం’ అని అనీష అంబ్రోస్ తెలిపింది. ప్రస్తుతం అనీష అంబ్రోస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న గబ్బర్ సింగ్ 2 సినిమా కోసం ప్రిపేర్ అవుతోంది.


