రాఘవ లారెన్స్‌కు కలిసొచ్చిన హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగం మూడోసారి కూడా ఆయనకు ఘన విజయాన్ని తెచ్చిపెట్టింది. ‘ముని’, ‘కాంచన’ తర్వాత ఆ సిరీస్‌లో మూడో సినిమాగా వచ్చిన ‘కాంచన 2’ విడుదల రోజునుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని ఓవరాల్‌గా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య తమిళనాట ఏప్రిల్ 17న విడుదలైన ఈ సినిమా పెద్ద ప్రభంజనమే సృష్టించింది. ఒక మిడిల్ బడ్జెట్ సినిమా ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం తమిళ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
కాగా రూ. 20కోట్ల బడ్జెట్ లోపే రూపొందిన ఈ సినిమా సాటిలైట్ రెవెన్యూ, థియేటర్ రెవెన్యూ ఇలా అన్నీ కలుపుకుంటే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్టే లెక్క అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే సినిమా తెలుగులో ‘గంగ’ పేరుతో డబ్ అయి తెలుగులోనూ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! ఫస్టాఫ్‌లోని హర్రర్ పార్ట్, మాస్ కామెడీ, తాప్సీ, నిత్యామీనన్‌ల నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమా తర్వాత రాఘవ లారెన్స్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి.


