విలన్‌ అవతారం ఎత్తనున్న క్లాస్ డైరెక్టర్!

11th, September 2016 - 12:59:36 PM

gautham_vasudeva_menon
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో దర్శకుడు గౌతమ్ మీనన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ సినిమాలో తనదైన బ్రాండ్‌ను చూపెడుతూ అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ దర్శకుడు, తాజాగా ఓ తమిళ సినిమాలో విలన్‌గా నటించేందుకు ఒప్పుకున్నారట. ఇమైకా నోడిగల్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రకు గౌతమ్ మీనన్ అయితేనే బాగుంటుందని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఆయన్ను సంప్రదించారట.

కాగా గౌతమ్ మీనన్ ప్రస్తుతం ధనుష్‌తో ఓ సినిమా చేస్తూ ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ కావని మొదట నో చెప్పారట. అయితే ఆ తర్వాత స్క్రిప్ట్ విన్నాక, నచ్చి, విలన్ రోల్ చేస్తానని మాటిచ్చారట. ఇప్పటివరకూ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా పనిచేసిన గౌతమ్, అడపదడపా తన సినిమాల్లో కొద్దిసేపు కనిపించినా, పూర్తి స్థాయిలో మాత్రం ఎప్పుడూ నటించలేదు. దీంతో గౌతమ్ మీనన్ నటించనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.