అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి ఓ సరికొత్త బ్రాండ్. కామెడీని తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ, తన బ్రాండ్‌ను మరింత పెంచుకుంటూ వచ్చిన నరేష్ ఈమధ్య కాలంలో మాత్రం తనదైన సినిమా చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ‘జేమ్స్ బాండ్’ ఆ లోటును తీర్చే సినిమాగా మొదట్నుంచీ ప్రచారం పొందుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం పరిచయమయ్యారు.
బాహుబలి సినిమా తప్ప తెలుగులో మరో సినిమా కనిపించని సమయంలో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్నిచోట్లా ఈ అల్లరి మార్క్ ఎంటర్‌టైనర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ సినిమాలకు ఎప్పుడూ రానంతగా ఈ సినిమాకు ఓపెనింగ్ వీకెండ్ మంచి కలెక్షన్లు వచ్చాయి. జేమ్స్ బాండ్.. ‘నేను కాదు నా పెళ్ళాం’ అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సినిమాలో సాక్షి చౌదరి అల్లరి నరేష్‌ను ఇబ్బందుల్లో పడేసే భార్యగా నటించింది.
ఇక సినిమాకు మంచి టాక్ రావడం, ఓపెనింగ్స్ కూడా బాగుండటంతో ‘జేమ్స్ బాండ్’ యూనిట్ నిన్నట్లుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రధాన ప్రాంతాల్లో సక్సెస్ టూర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టూర్‌లో హీరో, హీరోయిన్లతో పాటు దర్శకుడు, మిగతా యూనిట్ కూడా పాల్గొని అభిమానులను కలుసుకొని వారితో సరదగా గడిపారు. శ్రీకాకుళంలో నిన్న మొదలైన ఈ సక్సెస్ టూర్ పలు ప్రధాన నగరాల్లో కొనసాగుతూ వచ్చింది. అన్నిచోట్లా ఈ టూర్‌కు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేటి రాత్రి గుంటూరులోని ఓ థియేటర్లో జరిగే కార్యక్రమంతో ఈ టూర్ ముగుస్తుంది.


