విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి నటించిన సినిమా ‘గోపాల గోపాల’. దేవుడికి, నాస్తికుడికి మధ్య జరిగే సంఘటనల సమాహారమే ఈ సినిమా కథ. దేవుడిపై కేసు వేసే వ్యక్తిగా వెంకటేష్ నటించారు. త్వరలో విడుదల కానున్న ‘గోపాల గోపాల’ సినిమా.. ఎవరి మనోభావాలను, మత విశ్వాసాలను కించపరిచే విధంగా ఉండదని ‘ది హిందూ’ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే, ఇటివలే ఈ తరహా కధాంశంతో హిందీలో వచ్చిన అమీర్ ఖాన్ ‘పీకే’ సినిమా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని వెంకటేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘గోపాల గోపాల’ సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. సినిమాలో ఒకరి మనోభావాలను, మత విశ్వాసాలను కించపరిచే సన్నివేశాలు లేకుండా జాగ్రత్త తీసుకున్నాం. నిజానికి, మా సినిమాలో దేవుడు ఒక పాత్రధారిగా కనిపిస్తాడు. భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ వంటి మత గ్రంధాలలో నీతి సూత్రాలను, మంచి విషయాలను నాకు భోదిస్తాడు. అని వెంకటేష్ అన్నారు.
కిషోర్ పార్దసాని (డాలి) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటించారు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.


