ఆగిపోయిన సినిమాను తిరిగి స్టార్ట్ చేస్తున్న మ్యాచో స్టార్..!

gopichand

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకోగా, గతంలో నిలిచిపోయిన ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. నూతన దర్శకుడు కుమార్ సాయి దర్శకత్వంలో గోపీచంద్ ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2025లో ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది.

​ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఇదే బ్యానర్ నుండి నాగచైతన్య హీరోగా వస్తున్న ‘వృషకర్మ’ చిత్ర షూటింగ్ పూర్తవడంతో, మేకర్స్ ఇప్పుడు పూర్తి దృష్టిని గోపీచంద్ సినిమాపై పెట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెల నుండి లండన్‌లో దాదాపు రెండు నెలల పాటు భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. సినిమాలోని కీలక సన్నివేశాలన్నీ లండన్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నారు.

​ఈ చిత్రంలో మలయాళ నటి మీనాక్షి దినేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘సాహసం’ వంటి సూపర్ హిట్ తర్వాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ – గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version