
కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించి ఆ తర్వాత హీరోగా మారిన సునీల్ సినిమా వచ్చి సంవత్సరం దాటింది. ఈ గ్యాప్ లో పలు సినిమాలకు సునీల్ సైన్ చేసినప్పటికీ ఒక్క సినిమా కూడా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. సునీల్ కూడా తన చివరి సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వలన ఆచితూచి సినిమాలను ఎంచుకునే పనిలో ఉన్నాడు. సునీల్ ప్రస్తుతం మూడు సినిమాలకు సైన్ చేసాడు. అవేమిటంటే వాసు వర్మ – దిల్ రాజు కాంబినేషన్ మూవీ, వంశీ కృష్ణ ఆకెళ్ళ – ఆర్.పి.ఏ క్రియేషన్స్ మూవీ మరియు గోపి మోహన్ – అనిల్ సుంకర మూవీ.
ఇందులో అన్ని సినిమాలకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినప్పటికీ ఒక్క సినిమా కూడా సెట్ పైకి వెళ్ళలేదు. ముందుగా వాసు వర్మ – దిల్ రాజు మూవీ మరియు గోపి మోహన్ – అనిల్ సుంకర మూవీలు ఒకేసారి మొదలవుతాయని తెలియజేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం గోపి మోహన్ సునీల్ సినిమా వెనక్కి వెళ్ళింది. వాసు వర్మ – సునీల్ సినిమా పూర్తయ్యాకే గోపి మోహన్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని ఈ చిత్ర టీం తెలిపింది. దీని ప్రకారం ఈ సంవత్సరం చివరి సెషన్ లో గోపి మోహన్ – సునీల్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం సునీల్ ఓకే చేసిన రెండు సినిమాల్లో ఏది సెట్స్ పైకి వెళ్తుంది అనే దానిపై కూడా క్లారిటీ లేదు.

