పేద సినీ కళాకారుడిని ఆదుకున్న కేటీఆర్!

ktr

‘సిరిసిల్ల రాములు’.. ఈ పేరు వినగానే గుర్తొచ్చే సినిమా ‘వేదం’. అల్లు అర్జున్, మంచు మనోజ్‌లు హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాములు అనే ఓ పేద మగ్గం నేత కార్మికుడి పాత్రలో గుంటూరుకు చెందిన నాగయ్య నటించిన విషయం తెలిసిందే! ఆ సినిమాలో ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. నాగయ్య పేరు ‘వేదం’ సినిమా రిలీజ్ తర్వాత సినీ పరిశ్రమలో బాగా వినిపించింది. అయితే ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో నాగయ్యకు సినీ పరిశ్రమలో అవకాశాలు రాకపోవడంతో ఆయన పరిస్థితి అయోమయంగా తయారైంది.

ఇక పూర్తిగా సినీ అవకాశాలు సన్నగిల్లిన తరుణంలో బతుకును ఈడ్చడం కోసం నాగయ్య బిక్షాటన చేయడం కనిపించింది. ఫిల్మ్‌ నగర్‌లో గత కొద్దిరోజుల క్రితం బిక్షాటన చేస్తూ కనపడ్డ నాగయ్య గురించి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఆ క్రమంలోనే ఈ వార్త తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖా మంత్రి కేటీఆర్‌కు చేరింది. వెంటనే ఈ విషయంపై స్పందించిన కేటీఆర్‌, నాగయ్యకు లక్ష రూపాయల తక్షణ సహాయాన్ని అందించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున పేద కళాకారులకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమంలో నాగయ్య పేరును చేరుస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇదే సందర్భంగా ఈ విషయమై మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడినట్లు కేటీఆర్ తెలిపారు.

Exit mobile version