ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దుమ్మురేపుతోన్న బాలయ్య వందో సినిమా!

23rd, October 2016 - 01:41:21 PM

gpsk
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటిస్తోన్న వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళకముందు నుంచే బిజినెస్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఇప్పట్నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇప్పటికే ప్రధాన ప్రాంతాలన్నింటికీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడైపోయాయి.

నైజాం, సీడెడ్, ఓవర్సీస్ లాంటి ప్రాంతాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైపోయాయి. ఇక సాటిలైట్, మ్యూజిక్ రైట్స్ కూడా ఇప్పటికే అమ్ముడవడం విశేషంగా చెప్పుకోవాలి. చారిత్రక నేపథ్యంలో సాగే శాతకర్ణి జీవిత కథతో రూపొందుతోన్న ఈ సినిమాను, క్రిష్, భారీ బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటివరకూ గౌతమి పుత్ర శాతకర్ణికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి…

నైజాం ప్రాంత హక్కులను హీరో నితిన్‌కు చెందిన గ్లోబల్ సినిమాస్ 11.25 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.
గుంటూరు ప్రాంత హక్కులను ఎస్.పిక్చర్స్ సుమారు 4.50 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది.
ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సీడెడ్ హక్కులను 9 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా హక్కులను 3.60 కోట్ల రూపాయలకు బేకరీ ప్రసాద్ కొనుగోలు చేశారు.
నెల్లూరు హక్కులను భరత్ 1.98 కోట్లకు సొంతం చేసుకున్నారు.
ఇక సాటిలైట్ హక్కులను మాటీవి 9 కోట్లకు సొంతం చేసుకోగా, ఓవర్సీస్ హక్కులను 8 కోట్లకు 9పీఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.