పేదల పక్షపాతి, సైకిల్‌పై అసెంబ్లీకి వెళ్లి ప్రజా సేవ చేసిన మాజీ సీపీఐ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథ తెరకెక్కుతోంది. ‘గుమ్మడి నర్సయ్య’ (Gummadi Narsaiah) పేరుతో వస్తున్న ఈ బయోపిక్ షూటింగ్ ప్రారంభోత్సవ వేడుక డిసెంబర్ 6న పాల్వంచలో అట్టహాసంగా జరిగింది. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కన్నడ హీరో శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవితతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మొదటి సన్నివేశానికి గీతా శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లు ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ను అందించారు.
ఈ సందర్భంగా దర్శకుడు పరమేశ్వర్ మాట్లాడుతూ, రాజకీయమంటే సామాజిక బాధ్యత అని, కేవలం ప్రజాసేవకే అంకితమైన గుమ్మడి నర్సయ్య గొప్పతనాన్ని ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా పైసా సంపాదించుకోని నర్సయ్య పాత్రలో డా. శివ రాజ్ కుమార్ నటించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రియల్ హీరో గుమ్మడి నర్సయ్య పాత్రను పోషిస్తున్న శివరాజ్ కుమార్ ఈ సినిమాలో తెలుగు నేర్చుకుని డబ్బింగ్ కూడా సొంతంగా చెబుతానని వెల్లడించారు. ఈ సినిమా రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. వ్యవస్థలో, ప్రజల్లో మార్పు రావాలనే తన భావాలను మాత్రమే సినిమాలో చూపించాలని గుమ్మడి నర్సయ్య కోరారు.
