టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడైన గుణశేఖర్ సుమార్ 9 ఏళ్ళ పాటు రీసర్చ్ చేసి తీసిన సినిమా ‘రుద్రమదేవి’. ‘ది వారియర్ క్వీన్’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. మన కాకతీయ వీరణారి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రుద్రమదేవిగా అనుష్క కనిపించనుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ సినిమాని సెప్టెంబర్ 4న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ కాక ముందే గుణశేఖర్ అప్పుడే ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు. దానికి సంబందించిన రీసర్చ్ తో పాటు టైటిల్ ని కూడా రిజిస్టర్ చేసారు.
రుద్రమదేవి సీక్వెల్ కోసం గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ అనే టైటిల్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజిష్టర్ చేసాడు. అలాగే ‘ది లాస్ట్ ఎంపరర్’ అనేది ఈ సినిమాకి ఉపశీర్షిక. రుద్రమదేవి తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించిన రాజు ప్రతాపరుద్రుడు. ఇతను రుద్రమదేవి మనవడు(కుమార్తె కొడుకు). కాకతీయ సామ్రాజ్యంపై 7 సార్లు దండెత్తిన వచ్చిన ఢిల్లీ సుల్తానులను ఓడించిన మహాయోధుడు ప్రతాపరుద్రుడు. అంతే కాకుండా కాకతీయ సామ్రాజ్యాన్ని కేరళ వరకు విస్తరింపజేసిన రారాజు. అలాంటి వీరుడి కథని కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో గుణశేఖర్ రుద్రమదేవికి సీక్వెల్ ప్లాన్ చేసాడు. ఇప్పటికే దాదాపు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందని సమాచారం.
రుద్రమదేవి సినిమాలోనే సీక్వెల్ అయిన ప్రతాపరుద్రుడు కి సంబందించిన కొన్ని లీడ్ సీన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ‘ప్రతాపరుద్రుడు’గా నటించబోయే హీరో ఎవరా అనే చర్చలు ఫిల్మ్ నగర్లో మొదలయ్యాయి. మరి ‘ప్రతాపరుద్రుడు’ కోసం మీ ఛాయస్ ఎవరనేది కింద కామెంట్స్ రూపంలో తెలపండి..


