సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌కు ఈ మధ్య కాలంలో అస్సలు కలిసి రావడం లేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అనుకున్న ‘హిరణ్య కశ్యప’ ఆగిపోగా, ‘శాకుంతలం’ పరాజయం పాలైంది. ఆ తర్వాత సోషల్ మెసేజ్‌తో వచ్చిన ‘యుఫోరియా’ కూడా రిలీజ్ టైమింగ్, పబ్లిసిటీ లోపం వల్ల థియేటర్లలో సరిగా ఆడలేదు.
అయితే, ‘యుఫోరియా’ చిత్రం ఇటీవల ‘ఈటీవీ విన్’ ఓటీటీలో విడుదలయ్యాక దానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సినిమాను థియేటర్లలో చూడనందుకు బాధపడుతున్నామంటూ ప్రేక్షకులు పంపుతున్న మెసేజ్‌లు గుణశేఖర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. తన కెరీర్‌లోనే ఏ సినిమాకూ రానన్ని ప్రశంసలు దీనికి వస్తున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ జోష్‌తోనే ఆయన ప్రస్తుతం ఒక భారీ బడ్జెట్ పీరియడ్ మూవీతో పాటు మొత్తం నాలుగు సరికొత్త కథలను సిద్ధం చేసుకున్నారట.
మరోవైపు ఏడెనిమిదేళ్ల సమయం వృథా అయిన ‘హిరణ్య కశ్యప’ ప్రాజెక్ట్ తన చేతుల్లోంచి వెళ్ళిపోయినా.. ఆ రీసెర్చ్ సమయంలో వచ్చిన ఒక కొత్త ఐడియాపై ప్రస్తుతం వర్క్ చేస్తున్నట్లు గుణశేఖర్ తెలిపారు. అంతకంటే ముందే, ఈ ఏడాది దసరా కానుకగా ఒక యువ హీరోతో తన కొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నారట. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, స్వీయ నిర్మాణంలో మరో భారీ సాహసానికి ఆయన సిద్ధం కావడం విశేషం.


