తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. హీరోలు ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే ఈ దర్శకుడికి అభిమానులు దర్శకధీరుడు అని బిరుదు ఇచ్చారు. నేడు రాజమౌళి పుట్టినరోజు. ప్రేక్షకుల తరపున, 123తెలుగు.కామ్ తరపున రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ప్రతి సినిమాను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, వారిని సినిమాలో లీనమయ్యేలా చేయడం రాజమౌళి ప్రత్యేకత. అందుకే వరుస విజయాలతో.. తెలుగులో అపజయం ఎరుగని దర్శకుడిగా జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ సినిమాలతో రాజమౌళి రేంజ్ పెరిగింది. హిస్టారికల్, కామెడీ, టెక్నికల్ ఇలా ఎలాంటి సినిమా అయినా అద్బుతంగా తీయగలడని పేరు తెచ్చుకున్నాడు.
రాజమౌళి తాజాగా దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘బాహుబలి’. విడుదలకు ముందే ఈ సినిమాపై జాతీయ, అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. వాటిని చేరుకోవడానికి దర్శకధీరుడు మూడేళ్ళ నుండి కష్టపడుతున్నాడు. పుట్టిన రోజున కూడా ‘బాహుబలి’ షూటింగ్ తో బిజీ బిజీగా గడపనున్నాడు. బిజీగా కాదు, ఆనందంగా సెలబ్రేట్ చేసుకోనున్నాడు. వృత్తిని దైవంగా భావించే వారికి అందులో బిజీగా ఉండడం కంటే అనందం ఏముంటుంది.


