
‘షాక్’ సినిమాతో తెలుగు పరిశ్రమకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన దర్శకుడు హరిష్ శంకర్. హరిష్ శంకర్ గత చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ సినిమా ఫలితానికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తానని చెప్పారు హరీష్ శంకర్. బాపట్లలో జరుగుతున్న నాటక కళాపరిషత్ పోటీలకు అతిథిగా హాజరైన ఆయన, ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో ‘సుబ్రమణ్యమ్ ఫర్ సేల్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు హరీష్. ఇక ఈ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా, డీవీవీ దానయ్య నిర్మాతగా మరో సినిమా చేయనున్నట్లు హరీష్ తెలిపారు. అందుకోసం పవన్ కళ్యాణ్, రవితేజల కోసం ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో చూపుతూ ఒక పూర్తి స్థాయి కామెడీ సినిమా చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. మహేష్‌ను ఇప్పటివరకూ చూడని పాత్రలో చూపెట్టాలన్న ఆలోచన ఉందని చెప్పుకొచ్చారు.

