ఆర్ ఎక్స్ 100 మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన తాజా థ్రిల్లింగ్ సినిమా మంగళవారం. ఇటీవల మహాసముద్రం చిత్రం తర్వాత ఆయన తీసిన చిత్రమిది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి నిర్మించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. ఈ నేపథ్యంలో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు యూనిట్. ఈ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ ఇటీవల ముందుగా తన కొత్త చిత్రం మంగళవారం పోస్టర్ పంపించాడు అజయ్. అది నాకు ఆసక్తిగా అనిపించింది. సార్ మీరు అరగంట టైం ఇస్తే కథ చెబుతా అన్నాడు, అలానే అని కథ విన్నా.
నాకు ఈ కథ విన్నప్పుడు వంశీ గారి అన్వేషణ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా ఎలా ఎంజాయ్ చేశానో కథ విన్నప్పుడు ఇది కూడా అలానే ఎంజాయ్ చేశా. తప్పకుండా ముందుకు వెళ్ళమని చెప్పా. అప్పుడు స్వాతి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పాడు. తాను అనుకున్నది వచ్చే వరకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లను వదిలిపెట్టి ఉండదు. కథ నచ్చడంతో నైజాం రైట్స్ తీసుకున్నా. ప్రీమియర్లు వేయాలని అనుకున్నట్లు చెప్పారు. ముందు నాకు చూపించండి బావుంటే ఓకే ఒకవేళ మిస్ ఫైర్ అయితే కష్టం అన్నాను. బుధవారం ఉదయం షో వేశారు. కథ నాకు తెలిసినా సాధారణ ప్రేక్షకుడిలా చూశా. ఇంటర్వెల్ అవ్వగానే ఆసక్తిగా ఉందని చెప్పా.సెకండాఫ్ ఫస్ట్ 20 నిమిషాలు వావ్ అనిపించాడు. అరుంధతి సినిమా ఇక్కడే చూశా. అప్పుడు ఏదైతే ఫీల్ కలిగిందో మంగళవారం చూసినప్పుడు కూడా అలానే అనిపించింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో పార్ట్ రివీల్ చేస్తూ వచ్చాడు. ఈ రోజు ప్రేక్షకులు సినిమా బావుందని అనడానికి కారణం క్లైమాక్స్, ఆ ట్విస్టులు. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడికి ఇవ్వాలి.
కొత్తవాళ్లుతో, కొత్త నిర్మాతలతో సినిమా చేయడం అంత ఈజీ కాదు. కథ విన్నప్పుడు, సినిమా చూసినప్పుడు ఏం ఫీల్ అయ్యానో ఇప్పుడు ప్రేక్షకులు చెప్పినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యా. తొలి సినిమాతో సక్సెస్ అందుకున్న నిర్మాత స్వాతి గారికి కంగ్రాట్స్. ఈ సినిమా నైజాంలో శుక్రవారం ఉదయం రూ. 18 లక్షలు, మ్యాట్నీ రూ. 20 లక్షలు, ఈ రోజు ఉదయం రూ. 15 లక్షలు, మ్యాట్నీ రూ. 25 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. మౌత్ టాక్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ఇదే సాక్ష్యం. బలగం, బేబీ, సామజవరగమన, ఇప్పుడీ మంగళవారం విజయాలు ఉదాహరణ. ఇది ఆగే సినిమా కాదు ఇంకా పెద్ద సినిమా అవుతుంది అని చెప్పారు. దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఆర్ఎక్స్ 100 వైబ్స్ కనిపించాయి. ట్రైలర్ పెద్ద హిట్ అయ్యింది. ముందు మీడియాకు రెండు స్క్రీన్లలో షోస్ వేయాలని మేం అనుకున్నాం. తర్వాత పెయిడ్ ప్రీమియర్లు రెండు మూడు థియేటర్లలో వేస్తే చాలని అనుకున్నాం. హీరోయిన్, క్యారెక్టర్ బేస్డ్ మూవీ కనుక ప్రేక్షకులు చాలా నెమ్మదిగా వస్తారని అనుకున్నా.
పెయిడ్ ప్రీమియర్ బుకింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సాయంత్రానికి ఆల్మోస్ట్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. తర్వాత పెయిడ్ ప్రీమియర్ షోలు పెంచాం. సినిమా చూసిన వాళ్ళు ఎంతో బాగా చూపించారు. ఆర్ఎక్స్ 100 కంటే బెస్ట్ సినిమా అంటున్నారు. టేకింగ్, అజనీష్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు. మ్యూజిక్ మనసులోంచి పోవడం లేదని ఓ ప్రేక్షకుడు చెప్పాడు. నా చేయి తీసుకుని గుండె మీది పెట్టి చూడమన్నాడు. ఇంకో ప్రేక్షకుడు శివేంద్ర కెమెరా వర్క్ గురించి మాట్లాడాడు. నేను మూడు సినిమాలు తీస్తే ముగ్గురు తెలుగు కెమెరా మ్యాన్స్ వర్క్ చేశారు. దర్శకుడికి విజువల్ సెన్స్ ఉండి చెప్పగలిగితే ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి. ఇది టెక్నీషియన్స్ మూవీ అని ఈ రోజు అందరూ టెక్నికల్ వర్క్, ట్విస్ట్స్ గురించి మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది. అందుకని రస్టిక్, రియలిస్టిక్ బ్లాక్ బస్టర్ అని వేశా. రివ్యూలలో ట్విస్ట్స్ గురించి రాయలేదు. నేను రాయవద్దని రిక్వెస్ట్ చేశా.
వాళ్ళు కూడా హైడ్ చేశారు. వాళ్ళకు థాంక్స్. ఆర్టిస్టులు అందరికీ పేరు పేరునా థాంక్స్. కేవలం క్యారెక్టర్స్ మీద ఫస్టాఫ్ నడిపావ్ అని పెద్ద ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు. తెలుగు ప్రేక్షకులు పూర్వం నుంచి ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు ఆదరించారు. శివ, శంకరాభరణం, ఆర్య ఎక్స్‌పరిమెంటల్ సినిమాలే. ఆర్ఎక్స్ 100 నేను స్టార్లతో తీయలేదు. కొత్తవాళ్లతో బ్లాక్ బస్టర్ తీశా. మరోసారి ఎందుకు ప్రయోగం చేయకూడదని అనుకున్నా. మంగళవారం చూసిన ప్రేక్షకుల నుంచి నాకు రెస్పెక్ట్ లభించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇది టీమ్ అందరి హిట్. మేమంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అవుటాఫ్ బాక్స్ స్టోరీ తీసుకుని హిట్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. పాయల్ కూడా చక్కగా నటించింది. ఆమె పెర్ఫార్మన్స్ చూసి ఉంటారు కదా. తొలుత ఈ సినిమాలో వేరే వాళ్ళను తీసుకోవాలి ఆడిషన్స్ చేశా. కానీ, ఎవరూ సెట్ కాలేదు. ఆ టైంలో పాయల్ మెసేజ్ చేసింది.
ఆమె పెర్ఫార్మన్స్ గురించి డౌట్ లేదు. కానీ, ఆడిషన్ చేశా. బోల్డ్ రోల్స్ సెలెక్ట్ చేసుకోవడం తన సక్సెస్. సినిమాను ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ మీద తీసినా ఫైనాన్షియల్ ప్రెజర్ నా కంటే సురేష్ వర్మ, స్వాతి గారికి ఎక్కువ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నా అని అన్నారు. నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి మాట్లాడుతూ మా సినిమాకు ఇంత రెస్పాన్స్ ఇచ్చి, మాకు ఇంత పెద్ద విజయం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏడాది క్రితం సినిమా చేద్దామని అనుకున్నాం. అప్పుడు సినిమా చేయాలనేది నా డ్రీం. ఆ రోజు ఇలా సక్సెస్ మీట్ లో కూర్చుంటానని అసలు అనుకోలేదు. నా కలను నిజం చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నారు. ముందుగా సురేష్ వర్మ గారు, మా దర్శకుడు అజయ్ భూపతి గారు, ఆర్టిస్టులు అందరూ ఇక్కడ ఉన్నారు. కొత్త ప్రొడక్షన్ హౌస్ అయినప్పటికీ మమ్మల్ని నమ్మి పని చేశారు. నాకు ఏవైనా సందేహాలు ఉంటే అజయ్ భూపతి గారు అర్థం అయ్యేలా చెప్పారు. నన్ను చిన్న పిల్లలా చూసుకున్నారు.
ఆయన లేకపోతే ఈ ప్రయాణం ఇంత ఈజీగా ఉండేది కాదు. నేను ఈ సినిమా చేయాలని ఆయన వెయిట్ చేశారేమో అనిపించింది. ఇది థ్రిల్లర్ అయినప్పటికీ ఇందులో మంచి సందేశం ఉంది. మహిళలు అందరూ బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరూ సినిమా చూడాలి. నాకు ఆ మెసేజ్ నచ్చి సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. అజయ్ భూపతి గారు కథకు కమర్షియల్ వేల్యూస్ యాడ్ చేశారు. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా తీశారు. ఆర్టిస్టులు అందరూ సరదాగా ఉంటారు. వాళ్ళు సీరియస్ రోల్స్ ఎలా చేశారో అనిపిస్తుంది. పాయల్ బాగా నటించారు. అజయ్ భూపతి బిజీ అయిపోతారు. మమ్మల్ని మర్చిపోరని ఆశిస్తున్నా. అప్పుడప్పుడూ మేడమ్ జి అని ఫోన్ వస్తుందని ఆశిస్తున్నా. దిల్ రాజు గారు మమ్మల్ని ముందు నుంచి ఎంకరేజ్ చేశారు. ఆయనకు కూడా థాంక్స్ అని అన్నారు. పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అవుతుందని నేను ముందే అనుకున్నా. కానీ, ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు.
మా టీంతో పాటు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అజయ్ భూపతి గారు ఇచ్చారు. అప్పుడు ఆర్ఎక్స్ 100, ఇప్పుడు మంగళవారం ఇచ్చారు. ఒక్క సినిమాతో నా పని అయిపోతుందని అనుకున్నారు. మంగళవారంతో అది తప్పు అని నిరూపించా. సరైన దర్శకుడు, కథ వస్తే నేను వండర్స్ క్రియేట్ చేస్తా అని అన్నారు. సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర మాట్లాడుతూ మాకు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. నిన్నటి నుంచి నా ఫోన్ మోగుతూ ఉంది అని అన్నారు. ఈ విజయోత్సవంలో నటుడు లక్ష్మణ్, శ్రీతేజ్, శ్రవణ్ రెడ్డి, చైతన్య కృష్ణతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మొత్తంగా తమకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు మంగళవారం టీమ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసింది.


