ఇంటర్వ్యూ : విశ్వక్ సేన్- నాకు నచ్చినట్లు నేను ఉంటాను

Published on Sep 18, 2019 12:04 pm IST

నటించింది తక్కువ సినిమాలే అయినా పరిశ్రమలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది?, ఫలక్ నుమా దాస్ వంటి చిత్రాలలో ఆయన నటించడం జరిగింది. పరిశ్రమలో ఓ భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా విశ్వక్ కు పేరుంది. ఆయనతో 123తెలుగు.కామ్ స్పెషల్ ఇంటర్వ్యూ …

 

ఫలక్ నుమా దాస్ చిత్ర ఫలితం మీకు ఎటువంటి అనుభవాన్ని ఇచ్చింది?

వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఫలక్ నుమా దాస్ చిత్రం నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. పరిశ్రమలో వ్యక్తులు ఎలా ఉంటారు, ఒక వ్యక్తిని, సినిమాని క్రిందికి లాగడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు, అనే అనేక విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. ఆ మూవీ తీయడానికి నిర్మాతగా నాకు ఐదు నుండి ఆరో కోట్ల ఖర్చయింది. సినిమా మంచి విజయం సాధించడంతో నిర్మాతగా హ్యాపీగా ఫీలయ్యాను. ఒక వర్గానికి చెందిన ప్రజలకు మా చిత్రం బాగా నచ్చింది.

 

మీ ఆటిట్యూడ్ పై పరిశ్రమలో అనేక ఆరోపణలున్నాయి?

నాకు నచ్చినట్లు నేను ఉంటాను, ఎదుటివారి కోసం నటించడం నాకు రాదు, ఎవరో ఎదో అనుకుంటున్నారనేది నేను పట్టించుకోను. నేను ఇక్కడ కేవలం సినిమాల కోసమే ఉన్నాను.

 

దర్శకునిగా అనుభవం ఎలా ఉంది?

నిర్మాతగా కంటే కూడా దర్శకుని పనే చాలా సులభం. అంతా ప్రణాళిక ప్రకారం సాగిపోతుంది. ప్రస్తుతం ఓ బై లింగ్వల్ చిత్రం రాయడం జరుగుతుంది, దీనిని తెలుగుతో పాటు, హిందీలో కూడా తెరకెక్కిస్తాం.

 

ఒక దర్శకుడిగా మీ చిత్రాలు డైరెక్ట్ చేసే దర్శకులకు సలహాలిస్తారా?

నేను చేయబోయే నాలుగు చిత్రాలు, కొత్త దర్శకులతోనే. కథా చర్చల సమయంలో మాత్రమే నేను వారికి నా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక నేను వారి పనిలో జోక్యం చేసుకోను.

 

ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?

నటనకు ఎక్కువ స్కోప్ ఉండే డ్రామా జోనర్ లో చిత్రాలు చేయడానికి ఇష్టపడతాను. విశ్వక్ సేన్ ఎటువంటి పాత్రనైనా చేయగలడనే నమ్మకాన్ని దర్శకులలో కల్పించగలగాలి.

 

మీకు స్ఫూర్తి కలిగించిన నటుడెవరు?

నాకు స్ఫూర్తి హీరో విజయసేతుపతి. ఆయనను కంప్లీట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి పాత్రకైనా ఆయన సరిపోతారు. నేను కూడా అలాంటి నటుడు అని అనిపించుకోవాలన్నదే ఆశ.

 

తక్కువ సమయంలో చాలా పాపులర్ అయ్యారు, దీని వెనుక రహస్యం?

నన్ను అభినించేవారు ఒక నటుడిగా కంటే కూడా వ్యక్తిగా ఎక్కువ ఇష్టపడతారు. నేను చేసే సినిమాలను వారు చాలా ఇష్టపడతారు. ఒక మూవీ కోసం నేను చాలా కష్ట పడతాను. దాని ఫలితమే ఈ గుర్తింపు.

 

పరిశ్రమ మిమ్ముల్ని ఎలా ట్రీట్ చేస్తుంది?

నిజం చెప్పాలంటే ఇంత వరకు పరిశ్రమలలో ఉన్న ఏ పెద్ద హీరోని కలిసింది లేదు. నా మూవీ చూసిన కొందరు ఫోన్ చేసి అభినందించడం జరిగింది. నేను ఇంకా స్టార్ హీరోలను కలవాల్సివుంది.

 

మీ నెక్స్ట్ చిత్రాల గురించి చెప్పండి?

ఒక చిత్రం మరో పది రోజులలో చిత్రీకరణ పూర్తి కానుంది. ఇక పాగల్ అనే టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ మూవీ చేస్తున్నాను. వచ్చే ఏడాది నానుండి వరుసగా చిత్రాలు వస్తాయి.

సంబంధిత సమాచారం :

X
More