అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయి కుషి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హే చికీతా’. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్‌పి బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధన్ రాజ్ లెక్కల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్, దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సి.కళ్యాణ్, దామోదర్ ప్రసాద్, దశరథ్, నటుడు ప్రభాకర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఐదుగురు పవన్ కళ్యాణ్ అభిమానుల నేపథ్యంలో, రైతుల ఇతివృత్తంతో ఈ కథను రూపొందించినట్లు దర్శకుడు ధన్ రాజ్ తెలిపారు. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ సినిమాను కేవలం 21 రోజుల సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, నిర్మాతల్లో ఒకరైన ‘గరుడవేగ’ అంజి సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘హే చికీతా’ చిత్రాన్ని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.


