
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర సమాచారమొకటి తెలిసింది.
సినిమాలో కీలకమైన కొన్ని ఫైట్ సన్నివేశాలను వెరీ స్లో మోషన్‌లో చిత్రీకరించాల్సి ఉండగా, ఆ సన్నివేశాల కోసం చిత్ర యూనిట్ హై స్పీడ్ ఫాంటమ్ కెమెరాలను వినియోగిస్తోంది. రామ్ లక్ష్మణ్‌ల పర్యవేక్షణలో ఈ ఫైట్ సీన్ల షూటింగ్ జరుగుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బొమాన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది.